mt_logo

10.84 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరణ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు, ఇందుకోసం 10.84 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా లేబర్ రూములు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఇతర అన్ని రకాల మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. కొత్త ఆసుపత్రుల నిర్మాణం, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు, ఆసుపత్రుల ఆధునీకరణ పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నట్టు తెలియజేశారు. కరోనా కట్టడి కోసం మొదలుపెట్టిన జ్వర సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని మంత్రి అన్నారు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై సోమవారం వైద్యారోగ్య అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఎంసిహెచ్ఆర్డిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ… ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. ఒకవైపు సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేసేందుకు కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుండటంతో పాటు, మరోవైపు ఉన్న ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా దవాఖానలు, ఏరియా హాస్పిటళ్ళు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యశాఖ మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. 14 జిల్లాల పరిధిలోని 4 జిల్లా దవాఖానలు, 8 ఏరియా హాస్పిటళ్ళు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ జాబితాలో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కొత్తగా 20 రక్త నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కటి 12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో వీటిని నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 బ్లడ్ బ్యాంకులు ఉండగా, 51 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి. ఈ సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, టిఎస్ఎంఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *