mt_logo

రేవంత్ రెడ్డిది నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు: హరీష్ రావు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్‌లో జరిగిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అయితే తిట్లు, లేకుంటే దేవుళ్ళ మీద ఓట్లు కనిపిస్తున్నాయి. సీఎం ప్రజలకు ఏం కావాలో చేయాలి. నేను వచ్చేటప్పుడు వెలికట్టెలో నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు అని తెలిపారు.

పాలకుర్తి నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు.. ఒకరి దగ్గరికి పోతే ఒకరికి కోపం వస్తుందంట. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోయాయి.. సాగు నీరు అందడం లేదు.. కరెంటు లేదు.. మోటార్లు కాలిపోతున్నాయి అని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నుంచే రైతు బంధు పడుతుందని చెబితే.. ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపారు. పంట పెట్టుబడి ఇప్పుడైతే రూ. 10 వేలే వస్తాయి.. మేము వస్తే రూ. 15 వేలు వస్తాయి అన్నారు.. వచ్చాయా? అని అడిగారు.

పంట కోతలు అయిపోయినా.. కల్లాల్లోకి పంట వచ్చినా రైతుబంధు పడలేదు. పంట కోతకు వచ్చినా రైతు బంధు పడక పోవడమే మార్పు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన మార్పు.. ఆరు గ్యారెంటీలు, 13 హామీలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. బాండ్ పేపర్ పరువు తీశారు.. బాండ్ పేపర్ నమ్మకాన్ని వమ్ము చేశారు అని హరీష్ దుయ్యబట్టారు

ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత నాది అని సోనియా గాంధీతో కూడా ఉత్తరం రాయించారు.. అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 ఇస్తామన్నారు వచ్చిందా? నెలకు రూ. 2500 చొప్పున ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేలు బాకీ పడింది. గ్రామాల్లో మహిళలు రూ. 10 వేలు ఇచ్చాకే ఓటు అడగడానికి రావాలని చీపుర్లు, చాటలతో స్వాగతం పలకాలి అని అన్నారు.

రూ. 2500 పడ్డవాళ్లు కాంగ్రెస్ పార్టీకు.. రానివాళ్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలి. డిసెంబర్ 9న రైతు మాఫీ చేస్తామని రేవంత్ అన్నారు.. ఆగస్టు 15న చేస్తామని రేవంత్ కొత్త నాటకం షురూ చేశాడు. రేవంత్ రెడ్డి ఆనాడు ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటుకు ఒట్టు అంటున్నాడు.. దొంగ ఓట్లతో ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటున్నాడు అని విమర్శించారు.

రేపు ఉదయం 10 గంటలకు అమరవీరల స్తూపం దగ్గరకు నా రాజీనామా లేఖ తీసుకుని వెళ్తా.. రేవంత్ రెడ్డి .. ఆగస్టు 15 వరకు 6 గ్యారెంటీలు.. రూ. 2 లక్షల రుణ మాఫీ చేయడం నిజమైతే అమరవీరుల స్థూపం దగ్గరకు రాజీనామా లేఖతో రా. పెద్ద మనుషుల చేతిలో రాజీనామాలు పెడదాం.. నీ హామీలు నెరవేరితే నా రాజీనామా స్పీకర్‌కు ఇస్తారు. నాకు 5 ఏళ్లు ఎమ్మెల్యే పదవి లేకున్నా మా ఆడబిడ్డలకు రూ. 2500, అవ్వా తాతలకు రూ. 4 వేలు పెన్షన్ వస్తే నాకు సంతోషం. నేను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నాకు తెలంగాణ ప్రజల కళ్లలో ఆనందమే ముఖ్యం.. రేవంత్ రెడ్డి దేవుడు మీద ఓట్లు పెట్టింది నిజం అయితే రేపు అమరవీరుల వీరుల సాక్షిగా ప్రమాణం చేద్ధాం.. నువ్వు రాకుంటే దొంగ ఓట్లు పెట్టావని ప్రజలు నమ్ముతారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు, నీకు గుణపాఠం చెప్తారు అని పేర్కొన్నారు.

వడ్లను రూ. 2500 కు కొంటాం అన్నారు.. 2500 వడ్లు కొంటే కాంగ్రెస్ పార్టీకి.. రూ. 2500 కంటే తక్కువకు కొంటే కారు గుర్తుకు ఓటేసి సుధీర్ కుమార్‌ను గెలిపించాలి. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామన్నారు.. రూ. 15 వేలు రైతు బంధు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకు, రాని వాళ్లు బీఆర్ఎస్‌కు ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు.

కేసిఆర్ రూ. 200 పెన్షన్‌ను రూ. 2 వేలు చేశారు.. కాంగ్రెస్ రూ. 4 వేలు ఇస్తామన్నారు.. కేసీఆర్ ఇచ్చిన జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండు.. కేసిఆర్ ఉన్నప్పుడు 10 తారీకు లోపు ఇచ్చే పెన్షన్.. 30వ తారీకు వరకు ఇవ్వడం లేదు.. రేవంత్ రెడ్డి అవ్వా తాతలను గోస పెడుతున్నాడు. 42 లక్షల మంది అవ్వా తాతలకు కాంగ్రెస్‌కు క్షమాపణ చెప్పాలి. ఒక్కొక్క అవ్వా తాతకు రూ. 10 వేలు బాకీపడ్డారు

రేవంత్ రెడ్డి జనం మోసపోతారని ఓ టీవీ చర్చలో చెప్పాడు.. ప్రజలు ఎప్పుడో ఒకసారి మోసపోతారేమో.. ఎప్పుడూ మోసపోరు. ఇది ఉద్యమాల జిల్లా వరంగల్ .. పోరాటాల ఖిల్లా పాలకుర్తి గడ్డ.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ప్రజలు ఓటుతో నీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గడ్డపారలై పెకలిస్తారు అని హరీష్ హెచ్చరించారు

ఆనాడు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నాడు.. ఇప్పటికైనా అతని నిజ స్వరూపం గమనించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు కావు. కాంగ్రెస్ గెలిస్తే హామీలు అమలు చేయకున్నా మాకే ప్రజలు ఓటేశారని రేవంత్ రెడ్డి అంటాడు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి ఆరు గ్యారెంటీలు అమలు చేయించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు.

కడియం శ్రీహరికి కేసిఆర్ ఏం తక్కువ చేశారు.. కేసిఆర్‌ను పట్టపగలు మోసం చేసి.. పార్టీకి ద్రోహం చేశాడు. కడియం లాంటి వాళ్లు జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్పాలి. టికెట్ తీసుకుని కాంగ్రెస్‌లోకి వెళ్ళాడు.. అందరూ ఆలోచించాలి అని కోరారు 

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. బీజేపీ వాళ్లు కూడా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని రైతులను మోసం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరను పెంచారు.. జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. బీజేపీ అదాని, అంబానీలను ప్రపంచ కుబేరులను చేశారు తప్ప పేదలకు చేసింది ఏమీ లేదు.. బీజేపీ కార్పొరేట్ల పార్టీ అని హరీష్ రావు ధ్వజమెత్తారు.

పేదల గురించి పని చేసిన నాయకుడు కేసీఆర్.. కాంగ్రెస్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. బీఆర్ఎస్ రెండు టికెట్లు మాదిగలకు, ఒకటి మాలలకు ఇచ్చింది. మాదిగలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయి అని తెలిపారు