mt_logo

బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్

మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచిండు. రేవంత్ రెడ్డికి మల్కాజ్‌గిరి ఎంతో ఇచ్చింది.. పీసీసీ, సీఎం పదవులు రావటానికి మల్కాజ్‌గిరి ప్రజలే కారణం. అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏమీ చేసిండు అని ప్రశ్నించారు.

పార్లమెంట్‌లో పత్తా లేకుండా పోయిండు.. ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయిండు. ఈ వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు. మీకు 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి అని కోరారు.

పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన.. వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. బడే భాయ్ మోడీ మనకు బడా మోసం చేసిండు. చోట భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ మోసం చేసిండు. వంద రోజుల్లో అందరికీ అన్ని చేస్తా అంటూ చోటా భాయ్ మోసం చేసిండు అని పేర్కొన్నారు.

గద్దెనెక్కగానే వెంబడే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చినయా? పైన పెద్ద మోసగాడు.. కింద చిన్న మోసగాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ -2 సినిమా చూపిస్తున్నాడు అని విమర్శించారు.

ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు.. రెండోసారి మోసపోతే మోసపోయిన వారిదే తప్పు. ఇప్పుడు ప్రజలంతా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రజలంతా బీఆర్ఎస్‌కు పట్టం గట్టారు అని గుర్తు చేశారు.

గత పదేళ్లలో హైదరాబాద్‌కు, తెలంగాణకు బీజేపీ ఏం చేసింది. ఉప్పల్, అంబర్‌పేట్‌లో పదేళ్లలో రెండు ఫ్లై ఓవర్లు కూడా కట్టలేకపోతున్నారా.. మేము 36 ఫ్లై ఓవర్లు కడితే రెండు కూడా కట్ట చేతకాని బీజేపీకి ఓట్లు అడిగేందుకు సిగ్గు ఉందా? అని కేటీఆర్ దుయ్యబట్టారు

ఏం చేశారని అడిగితే చాలు జై శ్రీరామ్ అని అంటారు. శ్రీరామునితో మనకు ఎలాంటి పంచాయితి లేదు. శ్రీరాముడు కూడా లంగలు, దొంగలను గెలిపించమని చెప్పడు. మనం కట్టలేదా యాదగిరి గుడి.. కానీ ఓట్ల కోసం మతాన్ని వాడుకోలేదు..మోడీ అక్షింతలు పంపిస్తే.. కేసీఆర్ దేశం మొత్తానికి తినటానికి బియ్యం పంపించిండు అని తెలిపారు.

మోడీ వచ్చిన నాడు రూ. 400 సిలిండర్.. ఇప్పుడు రూ. 1100..మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్.. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్‌కు 84 డాలర్లు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు.. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది.. పప్పు, ఉప్పు, చింతపండు, బస్సు, రైలు అన్ని ధరలు పెంచిండు. అందుకే మోడీని ప్రజలందరూ ప్రియమైన ప్రధాని కాదు పిరమైన ప్రధాని అని అంటున్నారు అని ధ్వజమెత్తారు.

కేసీఆర్ లేడు రాష్ట్రం ఆగమైందని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ నిన్న మొత్తం అనుమానాలకు సమాధానాలను వివరంగా చెప్పిండు.. రేవంత్ బక్వాస్ ప్రచారాలను తిప్పి కొట్టిండు. మీరు 10 స్థానాలు ఇస్తే మళ్లీ రాష్ట్రంలో కేసీఆరే రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది అని విశ్వాసం వ్యక్తం చేశారు.

మోడీ 400 సీట్లు అని బిల్డప్ ఇస్తున్నాడు.. వాళ్లు పోటీ చేసేదే 420 సీట్లు. మోడీ గెలవడని అర్థమైంది కనుకనే ముస్లింల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్డీఏ కూటమికి 200 దాటావు, ఇండియా కూటమికి కూడా 150 సీట్లు దాటావు. అందుకే బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్లె మనల్ని బతిమిలాడే పరిస్థితి వస్తది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బడే భాయ్ మోడీకి మేలు చేసేందుకు చోటే భాయ్ రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ నుంచి డమ్మీ అభ్యర్థిని పెట్టిండు. రాష్ట్రంలో చాలా చోట్ల మోడీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు.. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు.. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం పనిచేస్తుండా? అని అడిగారు.

బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది. 2014, 2019లో కూడా బీజేపీని అడ్డుకున్నది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ఈటల, బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరు. బీజేపీ లీడర్లు అందరిని ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే.. బీజేపీని ఓడించే దమ్ము లేని కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేయొద్దు అని తేల్చి చెప్పారు.

కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే కేసీఆర్ కూతురు జైల్లో ఉండేదా? తప్పుడు ప్రచారాలను మైనార్టీలు నమ్మవద్దు. బీజేపీని ఓడించే దమ్ము లేకనే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.

మరోసారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మొత్తం పథకాలను రేవంత్ రెడ్డి బంద్ పెడతడు. ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తడు. కాంగ్రెస్ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలె.. అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్లీ కేసీఆర్ చుట్టు రాజకీయాలు తిరిగే పరిస్థితి తీసుకొద్దాం అని పిలుపునిచ్చారు.