mt_logo

టి.కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి ఒక ‘తురుపు ముక్క’!

By: జే ఆర్ జనుంపల్లి

డిసెంబర్ 9 , 2009 గడిచిపోయి చాలా రోజులవుతుంది. ఈలోగా మూసీ నది మీది పురానాపూల్ బ్రిడ్జి కింద చాలా నీరు ప్రవహించింది కూడా. తెలంగాణ అమరవీరుల సంఖ్య 850కి పెరిగింది. తెలుగుదేశం, కాంగ్రెస్ తెలంగాణ లో జరిగిన అన్ని బై-ఎలెక్షన్లలో ఘోరంగా ఓడిపోయినవి. తెలంగాణ ప్రజల తరగని ఉద్యమస్ఫూర్తి రాష్ట్ర పరిపాలనను అతలాకుతలం చేసింది. ఉద్యమ ప్రభావం ఆంధ్రలో జరిగిన బైఎలక్షన్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. అక్కడ కూడా కాంగ్రెస్, టిడిపి అభాసు పాలైనాయి. నేడు ఈ రెండు పార్టీల పరపతి అట్టడుగున కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ దెబ్బతో దిమ్మతిరిగిన ఈ రెండు పార్టీలు దిక్కుతోచని పరిస్థితిలో కొత్త రాజకీయ పుంతలు తొక్కుతున్నాయి.

చంద్రబాబు తెలంగాణ కొరకు టిఆర్ఎస్ తో పొత్తు, ఎన్నికల్లో లోపాయికారి ద్రోహం, అసెంబ్లీలో అఖిలపక్షంలో తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం, పార్లమెంటు తెలంగాణ ప్రకటనకు 24 గంటల్లో విద్రోహం, తదుపరి రెండు కళ్ళ సిద్ధాంతం, ఇత్యాది నికృష్ట రాజకీయాలు నిరంతరంగా నడుపుతూనే ఉన్నాడు. కొత్తగా ఇప్పుడు బయటికి రాయలసీమ పేరుతో మూడో కన్ను మొలిపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. తాను మాత్రం అంతర్గతంగా మేకతోలు కప్పుకొన్న తోడేలులాగా సమైక్యాంధ్రవాద కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

సోనియాగాంధీ 2004లో నివురు గప్పిన తెలంగాణ కోరికను ఒక బాస చేసి వెలిగించడం, తిరిగి ఎన్నికల ఓడ దాటిన తర్వాత మొహం తిప్పేయడం, వై ఎస్ ఆర్ వాపును బలుపుగా భావించి తెలంగాణ కోరికను అణగదొక్కే ప్రయత్నం చేయడం, తెలంగాణ ఉద్యమ తీవ్రతకు తట్టుకోలేక, గత్యంతరంలేక డిసెంబర్ 9 , 2009 పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన చేయడం, తిరిగి టిడిపి, ఆంధ్ర కాంగ్రెస్లతో కలిసి అప్రజాస్వామికంగా ఆ ప్రకటను వమ్ము చేసే ప్రయత్నాలు చేయడం, అప్పటినుండీ ఆరని నిప్పు లాంటి తెలంగాణ ఉద్యమానికి ఇదుగో అదుగో అంటూ ప్రతి పార్లమెంటు సమావేశాన్ని దాటవేస్తూ, పోలీసుల బలగాల దమనకాండతో, 2014 వేపు తెలంగాణ ను లాక్కొని పోయే ప్రయత్నాలు వంటి ఎన్నో రాజకీయ ఎత్తుగడలు ఎడతెరిపి లేకుండా అమలు చేస్తూనే ఉంది.

ప్రస్తుతం తెలంగాణ ప్రజల చేతుల్లో మరియు తానే సృష్టించిన ‘ఫ్రాంకెన్ స్టీన్’ వై ఎస్ ఆర్ యొక్క ‘మాన్స్టర్’ వై ఎస్ జగన్ చేతిలో చావుదెబ్బలు తిని, సిబిఐని వాడి, జైలు రాజకీయం చేసి ఒక అప్రజాస్వామికమైన తెర వెనుక ఒప్పందంతో మరొక దుర్మార్గపు రాజకీయానికి తెరతీస్తున్నది. ఈ సరికొత్త రాజకీయ దుర్మార్గంలో, వై ఎస్ ఆర్ సి పి, సీమాంధ్ర, తెలంగాణ ల్లో కాంగ్రెస్ కీలుగుర్రం లాగ పనిచేసి, 2014 లో యు పి ఎ కు అత్యధిక పార్లమెంటు సభ్యులను చేకూర్చడం అనేది ఎత్తుగడ. దీనికి ప్రతిగా జగన్ మెడకు చుట్టుకొన్న సి బి ఐ, ఎంఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఇ.డి) ల ఉచ్చును కాంగ్రెస్ తొలగించవలసి ఉంటుంది. ఇప్పటికే జగన్ వ్యూహాత్మకంగా తన బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకొన్నాడు. ఇడి తన దర్యాఫ్తు తంతు పూర్తి చేసే యత్నంలో ఉంది. సిబిఐ తన జోరు తగ్గించింది. ఇక జగన్ విడుదల తదుపరి చిత్రం వెండితెర మీద చూడడమే మిగిలిఉంది.

కాంగ్రెస్ అధిష్టానం, ఆంధ్ర కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ద్రోహం చేస్తూ ఇంత రాజకీయం చేస్తుంటే, తెలంగాణ ప్రజలు, టి ఆర్ ఎస్, జే ఎ సి నిరంతరంగా వీరితో పోరాడుతూ తీరని నష్టాలకు, కష్టాలకు గురై అఘోరిస్తుంటే, ఈ రెండు పార్టీల తెలంగాణ శాసనసభ్యులు తమ రాజకీయ కర్తవ్యం మరిచి తమ పార్టీలకు ఊడిగం చేస్తూ తెలంగాణ ప్రజల మెడకు గుదిబండలై వేలాడుతున్నారు. టిడిపి – శాసన సభ్యులు చంద్రబాబు పెంపుడు కుక్కలై మొరగమన్నప్పుడు మొరగడం, ఊర్కోమ్మన్నప్పుడు తోక లాడిస్తూ ఉండడం చేస్తున్నారు. టి.కాంగ్రస్ శాసన సభ్యులు అమ్మగారు కలలో కనిపడినా దడుసుకొంటున్నారు. ఎక్కడ ఉన్న పదవి ఊడిపోతుందో, ఎక్కడ వచ్చే రాబడి ఆగిపోతుందోనని గుండెలు అరచేతిలో పెట్టుకొని, పోలీసుల బందోబస్తులో తప్పించుకు తిరుగుతున్నారు. దీనికి తోడు కిరణ్ కుమార్ రెడ్డి గారి తెలంగాణ వ్యతిరేక ప్రోత్సాహకాల పారితోషికాలు, పందేరాలు కూడా బాగా పని చేస్తున్నాయి. ఒకరిద్దరు శాసన సభ్యులు పార్టీనెదిరించి టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ వైపు నిలబడడం తప్ప, మిగతా అందరు సోనియమ్మ గులాంగిరీ చెయ్యడంలో అద్భుతమైన ఐకమత్యం ప్రదర్శిస్తున్నారు. ఇక తెలంగాణ మంత్రులైతే తమను ఎన్నుకొన్న ప్రజలకు పూర్తిగా ద్రోహం చేసి పోలీసుల రక్షణలో అవినీతి ఆబతో ఇంట్లో, ఆఫీసులో తీరికలేకుండా పనిచేసి రెండు చోట్ల రెండు చేతులా దండుకొంటున్నారు. వారికి తెలంగాణ ఉద్యమం ఎక్కడా కనిపించడం లేదు. కొందరు వీర విధేయ శాసనసభ్యులు బాహాటంగానే తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరందరికీ నాయకుడని చెప్పుకోబడుతున్న జానారెడ్డి మరి కొందరు మంత్రులు ప్రభుత్వాన్ని వీడడం ధర్మం కాదని, వారి పద్ధతిలో వారు కూడా తెలంగాణ రావడానికి ఎడతెగకుండా పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఆ పధ్ధతేమిటో ఎవరికీ చెప్పే అవసరం లేదంటున్నారు. అయితే వారు, అధిష్టానం చెప్పినట్లు తోకాడించడం తప్ప, తెలంగాణ కొరకు చేస్తున్న వేరే ప్రయత్నం కానీ పద్ధతి కానీ ఎవరికీ అర్థంకావడం లేదు. మొత్తం మీద టి. కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు పూర్తిగా అధిష్టానానికి, ముఖ్యమంత్రికి తమ ఆత్మలు తాకట్టు పెట్టి అవినీతి సంపాదన వదులుకోలేక తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అడ్డంగా పనిచేస్తున్నారనేది అక్షర సత్యం.

ఇక మన టి.కాంగ్రెస్ ఎంపిల సంగతి కొంచెం వేరు. వారికి అదనంగా మంత్రి పదవులు లేవు. వారు తెలంగాణ వ్యతిరేక ప్రోత్సాహక స్కీముల్లో కూడా లేరు. బహుశః అధిష్టానానికి వీరికి అంతటి ప్రోత్సాహం ఇచ్చే అవసరం కనిపించలేదేమో. అయితే ఈ ఎంపిలు తెలంగాణ వాదానికి కొంత అండగా ఉండి కొన్ని ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తున్నట్లున్నారు కూడా. అయితే వారు చేసే పనుల్లో ఒక పద్ధతి లేదా ఒక నిబద్ధత అంత స్పష్టంగా కనపడటం లేదు. సమయాన్ని బట్టి అధిష్టానం మూడ్ ను బట్టి, గమ్యం లేని మాటలు మాట్లాడుతూ కాలహరణం చేస్తున్నారు. ఎక్కడో దూరంగా సందు దొరికినప్పుడు ఉత్తర కుమార ప్రజ్ఞలు పలుకుతుంటారు. మళ్ళీ కేంద్రానికి వెళ్ళినపుడు, అధిష్టానం అడక్కముందే అందరికంటే ముందు వాళ్ళ పనులు చేసి పెడుతుంటారు. ఎప్పుడూ అధిష్టానం తెలంగాణ విషయంలో చేస్తున్న నిరంతర వాయిదా ప్రక్రియకు అలసి పోకుండా యధాలాపంగా సహాయపడుతుంటారు. మళ్ళీ ఇప్పుడు ప్రాణ త్యాగాలని ఇంకేవో తెగింపులని టిఆర్ఎస్, టిజేఎసితో కలిసి వృథా ఆడంబరపు రంకెలు వేస్తున్నారు. మరి ఇవి ఈ పార్లమెంట్ సెషన్ అయిపోయేదాకా జరిగే పగటి వేషాలు కూడా కావచ్చు.

2010 మొదటినుండీ తెలంగాణ లో జరుగుతున్న ఉద్యమం, దాని వలన ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కనుగూలంగా టి కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడూ స్పందించ లేదు. వారికి ఈ ఉద్యమ నేపధ్యంలో తమకు తమ పార్టీకి తమ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో అవకాశాలొచ్చినాయి. డిసెంబర్ 2009 తదుపరి ఆంధ్ర కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పురిట్లోనే సంధి కొట్టించినప్పుడు వీరంతా ఏకమై రాజకీయ స్పూర్తితో అధిష్టానాన్ని ఎదిరించి ఉంటే అప్పుడే తెలంగాణ వచ్చేది. అధిష్టానం తప్పనిసరయి ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన సమస్యను పరిష్కరించుకొనేది. ఇప్పటి వరకు తమకు తమ పార్టీకి కూడా సుస్థిరమైన పరిస్థితులు ఏర్పడేవి. తిరిగి, తెలంగాణ ప్రాంతంలో జరిగిన బై-ఎలెక్షన్ల గెలుపు బలంతో ముఖ్యమంత్రి అవిశ్వాస సమయంలో అధిష్టానాన్ని ఎదిరించినా ఫలితం ఉండేది. మొన్న జరిగిన ఆంధ్ర బై -ఎలెక్షన్ల ఓటమితో ఆంధ్ర కాంగ్రెస్ కు అధిష్టానంపై ఉన్న పట్టు పూర్తిగా సడలి పోయింది. అ ఎలెక్షన్ల ఓటమితో కొట్టు మిట్టడుతున్న అధిష్టానాన్ని రాష్ట్రపతి ఎన్నికల సమయంలో నిలదీసి ఉంటే కూడా ఫలితం దక్కేది. ఇవన్నీకూడా పేకాటలో తురుపు ముక్కల్లాంటి అవకాశాలు. కానీ రాజకీయ చైతన్యం, సమయ స్ఫూర్తి, చారిత్రక స్పృహ, సాహసం లేని ఈ శిఖండులు ఆ అవకాశాలను ఉపయోగించుకోలేదు. పైగా సోనియా గాంధీకి బానిసలై తెలంగాణ ప్రజల హృదయ శల్యాలై ఉద్యమాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నారు.

ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆంధ్ర బై–ఎలెక్షన్ల తో ఆంధ్ర కాంగ్రెస్, టిడిపిల సత్తా పూర్తిగా బయటపడింది. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులైన ఈ శక్తులు బలహీనపడడానికి గల కారణాల్లో ముఖ్యమైనది తెలంగాణ ఉద్యమం. ఆ విషయం ఇప్పుడు అధిష్టానానికి కూడా అర్థమయ్యింది. టిడిపి అయితే తెలంగాణ లో చంద్రబాబు ద్రోహానికి పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. జగన్తో ఏదో లోపాయికారీ ఒప్పందాలు చేసుకొన్నప్పటికీ, జగన్ కాంగ్రెస్ లో పూర్తిగా విలీనం కాజాలడు. ఒక వేళ అయితే ఆంధ్ర ప్రాంతంలో టిడిపికి బాగా ఉపయోగపడే అవకాశముంది. ఆంధ్ర కాంగ్రెస్ కు కూడా ఈ విషయంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. తెలంగాణ లో 2014 లో కాంగ్రెస్, వై ఎస్ ఆర్ పి ఎత్తుగడలు నల్లేరు మీద బండిలాగా సాగే అవకాశాలు చాల తక్కువ. అయితే ప్రస్తుతం ఆంధ్ర బై-ఎలెక్షన్ ఫలితాలు కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ సమస్యను 2014 ఎలెక్షన్ల దాకా లాక్కుపోదామనే ఆలోచనలో మార్పు తెచ్చింది. అధిష్టానం ఇంతకు ముందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎక్కువగా ఆలోచించే అవసరం ఏర్పడింది.

ఇప్పుడు టి కాంగ్రెస్ సుమారు 50 మంది శాసనసభ్యులు, మంత్రులు, 12 మంది పార్లమెంట్ సభ్యులు కలిసి సమష్టిగా అధిష్టానం,ఆంధ్ర కాంగ్రెస్ ఆటను కట్టించే అవకాశం ఉంది.

ఎలాగూ జేఎసికి, టిఆర్ఎస్ కు ఉద్యమాన్ని ఉధృతం చెయ్యక తప్పదు. ఈసారి తెలంగాణ విషయం తేలిపోవాల్సిందే. రాష్ట్రం ఇవ్వకుండా ఉండే పరిస్తితుల్లేవు. 56 ఏళ్లుగా తెలంగాణ ను కొల్లగొట్టిన తీరు, జరిగిన ఊహలకందని నష్టం, వెలుగు చూసిన అన్యాయాలు, నేడు కూడా ‘ఆంధ్ర’ ప్రభుత్వం, ఆంధ్ర నాయకులూ ప్రవర్తిస్తున్న తీరు ఏ విధంగా చూసినా గానీ రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండడం అనేది ఊహ కందని విషయం. జరిగిన, తీర్చలేని అన్యాయానికి తెలంగాణ విడిపోవడం తప్ప వేరే ఏ ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ అధిష్టానం తనకై తాను, ఆంధ్ర కాంగ్రెస్ పై మరియు 2014పై ఉన్న కొన్ని అనిశ్చిత వ్యామోహాలతో తెలంగాణపై నిర్ణయం తీస్కోవడంలో ఊగిసలాడుతుంది. ఇప్పుడు టి. కాంగ్రెస్ ఒక తురుపుముక్కగా తన పాత్ర నిర్వహిస్తే అధిష్టానం ఊగిసలాట వీగిపోతుంది. దాని వల్ల వారు అటు కాంగ్రెస్ పార్టీకీ ఇటు తమ స్వంత రాజకీయ భవిష్యత్తుకు కూడా మార్గం వేసుకొన్న వారౌతారు. అది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి కూడా ‘గెలుపు-గెలుపు’పరిస్థితిని కల్పిస్తుంది. లేదంటే ఉద్యమం ఉధృతం కాకతప్పదు. కాంగ్రెస్ పార్టీ, టి కాంగ్రెస్ రెండూ ‘ఓటమి- ఓటమి’ దిశ వైపు దూసుకుపోక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *