mt_logo

అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. బండి సంజయ్ చేసిందేమి లేదు: కేటీఆర్

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్ల నిజం కేసీఆర్ పాలన.. పదేళ్ల విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధాల పాలన కాంగ్రెస్ పాలన. కరీంనగర్‌లో ఈ మూడు పార్టీల మధ్య పోటీ జరుగుతోంది ఆని పేర్కొన్నారు.

పదేళ్లు పనిచేసిన ప్రధాని మోడీ నిజానికి చేసిన మంచి పనులు ఏంటో చెప్పాలె. ఓ ప్రాజెక్ట్ కట్టినా, అభివృద్ధి చేసిన, గిరిజనులు, దళితులకు మంచి చేసిన పనులు చెప్పాలె.. కానీ ఒక్కటైనా మోడీ చేసిన మంచి పని ఉందా? 2014 లో ఏమన్నాడు.. ఇంటింటికి రూ. 15 లక్షలు అన్నాడు.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని చెప్పిండు.. బుల్లెట్ రైళ్లు, ఇండియాను 5 టిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని కూడా అన్నాడు.. ఒక్కటైనా అయ్యిందా? అని అడిగారు.

పదేళ్లు ఏం చేసినయ్యా అంటే చెప్పడానికి వాళ్లకు ఏమీ లేదు.. అందుకే మేము గుడికట్టినం అంటారు. గుడిని మనం కూడా కట్టినం.. కేసీఆర్ గారు యాదాద్రిని కట్టలేదా? గుడి మాత్రమే కాదు.. ఆధునిక దేవాలయాలు కట్టిండు.. తెలంగాణ బతుకు మంచిగ చేసిండు అని తెలిపారు.

కానీ మోడీ ఏ వర్గానికి మేలు చేయలె.. చేనేతలకు జీఎస్టీ వేసినా మొదటి ప్రధాని మోడీ. నేతన్నలు, రైతులకు, దేశానికి ఒక్కరికి కూడా మంచి చేసింది లేదు. మోడీ వచ్చినంక మొత్తం ధరలు పెంచిండు.. నూనె, పప్పు, ఉప్పు, చింతపండు ధరలు పెంచిడు. చమురు ధరలు తగ్గిన సరే 34 శాతం పన్ను వేసి మన వద్ద భారీగా పైసల్ వసూల్ చేసిండు. పెట్రోల్, డిజీల్ రేట్లు పెంచినందుకే అన్ని ధరలు పెరిగినయ్ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

ఐదేళ్లలో బండి సంజయ్‌ని మీరు ఎప్పుడైనా చూశారా ? కరీంనగర్, హుజురాబాద్‌లో ఎక్కడైనా కనిపించడా? గాలి తిరుగుడు, హిందూ, ముస్లింల పంచాయితీ తప్ప ఏం చేసిండు. మసీదులు తవ్వుదాం అంటాడు.. శివం, శవం అంటాడు తప్ప.. ఈ ప్రాంతానికి మేలు చేసే ఆలోచన చేయడు. పార్లమెంట్ సభ్యుడు రాష్ట్రానికి పైసలు తేవాలె. లోక్‌సభలో ప్రశ్నలు అడగాలె.. కానీ ఎక్కడ కనిపియ్యడు. అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. బండి సంజయ్ పీకిందేంది అని ధ్వజమెత్తారు.

ఏమన్నా అంటే రాముడు అంటారు.. రాముడంటే మాకు కూడా భక్తే. అసలు బీజేపోళ్లే మనకు కట్టు, బొట్టు, పండుగలు నేర్పించినట్టు బిల్డప్‌లు ఇస్తున్నారు. గాలి తిరుగుడు తిరుగుతూ, పిచ్చి మాటలు మాట్లాడేటోడు మనకు వద్దు. చదువుకున్న వ్యక్తి, సమస్యల పట్ల అవగాహన.. ఈ ప్రాంతం కోసం కొట్లాడే వినోదన్ననే గెలిపించండి అని పిలుపునిచ్చారు.

మతం పేరు, దేవుని పేరుతో ఆగం చేస్తే ఆగం కావద్దు.. వాడొకడు వీడొకడు పైసలు పంచితే ఆగం కావద్దు. కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు.. ఆయనకు తోడుగా ఎంపీగా వినోద్ గారిని గెలిపించి బలం చేకూర్చాలే అని అన్నారు.

రేవంత్ రెడ్డి వచ్చి మస్త్ నరికిండు.. రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ. 2,500, పెద్ద మనుషులకు రూ. 4 వేలు అని చెప్పిండు. చెప్పిదాంట్లో ఒక్కటైనా ఈ రేవంత్ రెడ్డి అమలు చేసిండా? రంజాన్ తోఫా లేదు.. స్కూటీలు రాలేదు.. కాంగ్రెస్ లూటీ మాత్రం చాలైంది అని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.. 10-12 సీట్లు ఇవ్వండి.. 6 నెలల్లో మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర కూడా చేస్తున్నారు. అందుకేే పార్లమెంట్‌లో గల్లా పట్టి అడిగే ఎంపీలు ఉండాలె.. బీజేపోళ్లు లంగలు.. మీరు ఓటేసిన తర్వాత మీరు ఎటు ఓటు వేశారో తెలిపే స్లిప్ ఉంటది.. అడిగి తీసుకోండి అని తెలిపారు.