mt_logo

ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నాడు: కేటీఆర్

ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిసారి మా పార్టీనే గెలిచింది. ఈ మూడు జిల్లాల్లోని విద్యావంతులు మరొకసారి మా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి గెలుపు కట్టబెడతారని నమ్మకం ఉంది అని తెలిపారు.

మా అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్ పిలానిలో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన విద్యావంతుడు, ఉత్సాహవంతుడు అని కొనియాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మోసం చేసిన తీరును ఈ మూడు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల 70 వేల నిరుద్యోగ యువత గుర్తించాలి. 50 వేల పోస్ట్‌లతో మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేసిన తీరును నిరుద్యోగులు ఇప్పటికే గుర్తించారు. మేము గతంలో ఇచ్చిన డీఎస్సీనే ఈ ప్రభుత్వం మరోసారి తిరిగి ఇచ్చింది అని అన్నారు.

జాబ్ క్యాలెండర్ అన్నారు.. దానిపైన ఇప్పటిదాకా ఏ విషయాన్ని తేల్చటం లేదు. గతంలో పరీక్షలకు ఎలాంటి ఫీజులు తీసుకోమని చెప్పి ఈరోజు ప్రతి విద్యార్థి నుంచి రూ. 2 వేలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు, యువకులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రశ్నించేలా మా అభ్యర్థి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు. యువకులు నిరుద్యోగులను కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగడతారు అని అభిప్రాయపడ్డారు.

మా గత పది సంవత్సరాల ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి చేసిన సేవను గుర్తించి మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. మా ప్రభుత్వం జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టింది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అత్యధిక పే స్కేల్ ఇచ్చింది కూడా మా ప్రభుత్వమే. రెండు లక్షల ఉద్యోగ నియామకాలను ఇచ్చిన ప్రభుత్వం మాది. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మేము ఇచ్చిన  30 వేల ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పాలి అని కోరారు

రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలంటే.. ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సావంతుడు యువకుడైన వ్యక్తి శాసనమండలికి కావాలి. తప్పకుండా ఈరోజు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు. ప్రభుత్వాన్న ప్రశ్నించే గొంతుకలు కావాలి. ఒక బ్లాక్‌మెయిలర్, పార్టీలు మారే వ్యక్తిని ఎన్నుకుంటే ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే. గతంలో నల్లగొండలో నయీంను చూశాం. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అట్లాంటి వ్యక్తిని శాసనమండలికి పంపినట్లు అవుతుంది అని కేటీఆర్ అన్నారు.

10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినప్పటికీ ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులపైన నిందలు వేయలేదు మా ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగులతో మాకు ఉన్నది పేగు బంధం.. అందుకే ఏనాడు వాళ్ళని అదిలించలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి తన అసమర్థత, చేతగానితనంతో తప్పించుకునేందుకు విద్యుత్ సంస్థల ఉద్యోగులను నిందిస్తున్నారు. 24 గంటలు కష్టపడుతున్న విద్యుత్ సంస్థ ఉద్యోగుల పైన అభాండాలు వేస్తున్నారు అని అన్నారు.

7,700 మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు తీసుకువెళ్లిన విద్యుత్ సంస్థల ఉద్యోగుల అద్భుతమైన పనితీరును కూడా నిందిస్తున్నారు. రేవంత్ రెడ్డి కామన్ సెన్స్ లేకుండా తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ సంస్థల ఉద్యోగులను తిడుతున్నారు అని దుయ్యబట్టారు.

ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నారు. తను ప్రతిపక్ష నాయకుడిని కాదు ముఖ్యమంత్రిని అనే విషయాన్ని ఆయన ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్లను.. ఐఏఎస్ అధికారులను, విద్యుత్ సంస్థల ఉద్యోగులను ప్రతి ఒక్కరిని అడ్డగోలుగా మాట్లాడి తిట్ల దండకం అందుకున్నాడు అని గుర్తు చేశారు.

నారాయణఖేడ్‌లో టీచర్ల పైన లాఠీఛార్జ్ చేస్తారా.. ఒకవైపు టీచర్ల పై  లాఠీఛార్జ్.. ఇంకొక వైపు విద్యుత్ సంస్థల ఉద్యోగుల పైన నిందలు. ఇలాగేనా ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరించే తీరు అని ధ్వజమెత్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 లక్షల 87 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు అని చెప్పింది. కాంగ్రెస్ చెప్పినట్టు ఏడు లక్షల కోట్ల అప్పు అన్నది దివాలాకోరు ప్రచారం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం అప్పు పైన తప్పుడు ప్రచారం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి క్షమాపణ చెప్పాలి. నిన్నటిదాకా అప్పుడు చేయడమే తప్పు అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్  ప్రభుత్వం ఇప్పుడెందుకు అప్పు చేస్తోంది అని ప్రశ్నించారు.

మేము గతంలో అప్పులు తీసుకొని మౌలిక వసతుల పైన ప్రాజెక్టుల పైన రోడ్లపైన ఖర్చు చేశాం. ఆయన మమ్మల్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టాడు. కానీ ఈరోజు అప్పు తీర్చడం కోసమే అప్పు తీసుకుంటున్న దివాలా కోరు ప్రభుత్వం ఇది. మా ప్రభుత్వం మాదిరి ఆదాయం పెంచి.. ఆర్థిక పరిస్థితిని పెంచటం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావటం లేదు అని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్ నగరంపైన బీజేపీ ఆలోచనలు వేరే తీరుగా ఉన్నాయి.. వారి కుట్రలను జూన్ 4 తర్వాత అర్థం చేసుకుంటారు అని తెలిపారు.