mt_logo

పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడుకి, భూగర్భ కార్మికుడికి.. ఈశ్వరునికి, కోటీశ్వరునికి.. గుణవంతునికి, ధనవంతునికి మధ్య పోటీ: కేటీఆర్

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్‌లో జరిగిన బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ. 2,500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, రైతు భరోసా, బోనస్, తులం బంగారం, స్కూటీలు ఇలా ఎన్నో హామీలు చెప్పారు. ఏదైనా ఒక్కటైనా అమలైందా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు.. మరి రుణమాఫీ అయ్యిందా? అని అడిగారు.

పెద్దపల్లి అభ్యర్థి కోటీశ్వరుడు కదా? ఆయన అయినా సరే ఇచ్చిండా రైతులకు ఏమైనా ఇచ్చిండా? అయిన సరే మొండి చెయ్యికి గుద్దుదామా? కాంగ్రెస్ మళ్లీ ఓటు వేద్దామా? రాహుల్ గాంధీ రూ. 2,500 మహిళలకు వచ్చాయని చెబుతున్నాడు.. మరి రూ. 2500 వచ్చాయా? పెద్దమనుషులకు ఇస్తా అన్న రూ. 4 వేలు ఇచ్చుడు కాదు.. జనవరి నెల రూ. 2 వేలు ఎగ్గొట్టిండు.. రేవంత్ రెడ్డి ఇచ్చినా హామీలు ఏమైనా ఒక్కటైనా అమలయ్యా? అని ప్రశ్నించారు.

రైతుబంధు నాట్లప్పుడు ఇవ్వలే గానీ.. ఓట్లప్పుడు ఇస్తున్నాడు.. అందుకే గ్రామాల్లో రైతులు తిడుతున్నారు. తెలంగాణ రైతు ఆగమైండు.. మళ్లీ ఆత్మహత్యలు మొదలైనయ్. మోడీకి, రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే సింగరేణిని అదానీకి అమ్మేస్తాడు.. జనవరిలోనే స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు.. దానికి మోడీ మద్దతు ఉంది అని తెలిపారు.

10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ ఏం చేసిండంటే యువకులు, ప్రజలు ఎవరు చెప్పటానికి ఏమీ లేదు. ఏమైనా అంటే బీజేపోళ్లు గుడి కట్టినం అంటారు.. మరి కేసీఆర్ కట్టలేదా యాదాద్రి? ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్ట్‌లు కట్టిండు.. తెలంగాణ బతుకును బాగు చేసిండు. పదేళ్లలో ఎన్నో పనులు చేసిన కేసీఆర్‌ను పొగొట్టుకొని.. ఒక్క పనిచేయని మోడీని గెలిపించుకుందామా? అని అడిగారు.

రూ. 400 సిలిండర్‌ను 11 వందలు చేసిండు.. మళ్లా మోడీకి ఓటు వేస్తే సిలిండర్‌ను రూ. 5 వేలు చేస్తాడు.. ఈ ప్రధాని మోడీ ధరలు కూడా తగ్గిస్తా అన్నాడు.. కానీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిండు. పెట్రోల్ ధరలు, డిజీల్ ధరలు పెంచటం కారణంగా ఈ ధరలన్ని పెరిగాయి అని కేటీఆర్ అన్నారు.

కానీ బీజేపీకి చెందిన ఒక నాయకుడు మోడీ దేవుడంటాడు. దేనికి దేవుడు.. అన్ని ధరలు పెంచినందుకా? ప్రజలను ఆగం చేసినందుకా.. మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్‌కు 84 డాలర్లు. మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు.. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది.. పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు.. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడు. మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు. నేను చెప్పింది అబద్దమని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోతా అని సవాల్ విసిరారు.

పేదలను కొట్టిండు.. పెద్దలకు పెట్టిండు. కాకులను కొట్టిండు గద్దలకు పెట్టిండు. ఈసారి 400 సీట్లు అంటున్నారు బీజేపోళ్లు.. మళ్లీ గెలిస్తే సిలిండర్ ను రూ. 4 వేలు చేస్తారు. ఎంపీలు చేసే పని మత రాజకీయాలు చేసుడు కాదు.. దాని కోసం పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు. ఎంపీలు మాత్రం ప్రజలకు మంచి చేసే చేయాలి.. ప్రజలకు సేవ చేయాలె అని అన్నారు.

కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా. మీరు 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటు వేయండి. 10-12 సీట్లు ఇవ్వండి.. మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కన్నా కూడా బ్యాలెటే పెద్ద ఆయుధం.. మీ ఓటుతో మోసగాళ్లపై వేటు వేయండి ఆని పిలుపునిచ్చారు.

ఇక్కడి ఎమ్మెల్యే మనం శాంక్షన్ చేసిన లక్ష ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాజెక్ట్‌ను రద్దు చేయించాడని తెలిసి బాధపడ్డా.. దమ్ముంటే బీఆర్ఎస్ చేసిన దానికన్నా ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకోవాలె కదా? రాజకీయమంటే ప్రజలు ఎక్కువ సేవ, మంచి చేయాలని కోరుకుంటారు.. మంచిగ ఉన్నప్పుడు ఏదీ అర్థం కాదు.. గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆగమైతారని అప్పుడే చెప్పాం.. ఇప్పుడు కరెంట్ పోతోంది, నీళ్ల కష్టం మొదలైంది.. తినే పళ్లెంలా మన్ను పోసుకున్నట్లు అయ్యింది. ప్రధాని ఎన్నిక కదా? బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలె అంటున్నారు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇలాగే మాట్లాడారు.. కేసీఆర్ 17 సీట్లు గెలిచినా సరే తెలంగాణ ఎట్ల తెస్తాడు అని అన్నారు.. కానీ 5 మంది ఎంపీలతో దేశంలో 32 పార్టీలను ఒప్పించి తెలంగాణను తెచ్చింది కేసీఆర్.. మరి ఇప్పుడు 10-12 సీట్లు ఇస్తే సింగరేణిని కేసీఆరే కాపాడుతాడు అని పేర్కొన్నారు.

కొప్పుల ఈశ్వర్ గారు సింగరేణి నుంచి పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.. కేసీఆర్ గారు చెప్పినట్లు ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ జరుగుతోంది.. ఈశ్వరునికి కోటీశ్వరుని.. గుణవంతునికి ధనవంతునికి మధ్య పోటీ ఉంది.. మరి ప్రజల పక్షాన ఉండే కార్మిక నాయకుడిని గెలిపించుకుందామా? ఆగర్భ శ్రీమంతుడికి ఓటు వేద్దామా? అని అడిగారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే కావచ్చు గానీ చిల్లర మనిషి.. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి తిడితే.. సుమన్ ఎంతో రేషంతో రేవంత్ రెడ్డికి చెప్పు చూపెట్టి చెప్పుతో కొడుతా అని అన్నాడు. సుమన్ లాంటి మంచి నాయకుడిని కోల్పోయి మీరు బాధపడుతున్నారు.. కాని కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించండి. ఆయన చెన్నూరుకు ఎమ్మెల్యే మాదిరిగానూ పనిచేస్తారు అని కేటీఆర్ అన్నారు.