mt_logo

రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: కేటీఆర్

ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం రాజకీయాలను మాత్రమే తమ ప్రాధాన్యతగా తీసుకుంది. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో పడింది. రైతన్నలు తీవ్ర కష్టాల్లో బాధపడుతున్నారు అని తెలిపారు.

రైతులు తమ ధాన్యం ప్రభుత్వం కొంటలేదని బాధపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది. తమ ధాన్యం కొనే నాథుడు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం కావటం, అకాల వర్షాలు కురుస్తుండటంతో మొత్తం ధాన్యం వర్షాల పాలవుతోంది అని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు చేసే అధికారి లేకపోవడం.. కొనుగోలు చేయాలని ఆదేశించే ప్రజాప్రతినిధి లేకపోవడంతో రైతన్నలు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. 25 రోజులైన కూడా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో కొనే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. ఎన్నికల అయిపోయిన నేపథ్యంలో రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

ధాన్యం తరుగు విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో రైతుకు అన్యాయం చేయకుండా తరుగు లేకుండా రైతన్నలకు న్యాయం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు . రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నాలు,  రాస్తారోకోలు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి తన బాధ్యతను నిర్వహించి ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలి. ఈ ప్రభుత్వం స్పందించకుంటే రైతన్నల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు.

రైతులకు బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ అండగా ఉంటారు. మీ ధాన్యం కొనుగోళ్లతో పాటు 500 రూపాయల అదనపు బోనస్, రుణమాఫీ జరిగే వరకు రైతుల కోస పోరాటం చేస్తాం. కొనుగోలు కేంద్రాలు ధాన్యం వేగంగా కొనుగోలు చేసేదాక ప్రజల తరపున, రైతుల తరుపున ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని వారికి మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం అని కేటీఆర్ అన్నారు