హుస్నాబాద్‌లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హుస్నాబాద్ అంటే కేసిఆర్‌కు చాలా ఇష్టం, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలవాలి.. విధ్వసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలి అని పిలుపునిచ్చారు.
బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే ఆలోచించింది. రూ. 14 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసింది.. పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ఉసురు పోసుకుంది అని పేర్కొన్నారు.
బీజేపి పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? పిల్లలు జీవితాలు బాగవుతాయా? అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా? కాదు ట్రస్ట్ కట్టింది.. ఆలయ నిర్మాణానికి నేను కూడా రూ. 2 లక్షల విరాళం ఇచ్చాను అని తెలిపారు.
నిన్న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సుమంది.. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు ఓటు అడిగితే నెలకు రూ. 2,500 బాకీపడ్డారని, ఐదు నెలలకు రూ. 12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పాలి.. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్‌కు వచ్చిందా? అని హరీష్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు.. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు.. అతనికి ఓటు వేస్తే అంత ఉత్తది అయిపోతుంది. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్‌లో ఉంది, అది గెలిచే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు