mt_logo

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం – కేసీఆర్

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు రెండు వార్తాపత్రికలు మెట్రో ప్రాజెక్టుపై అవాస్తవాలు ప్రచురించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, మెట్రో పనులు ఆపేస్తామని ఎల్‌అండ్‌టీ అనలేదని, కావాలనే కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ అంశానికి సంబంధించి బుధవారం సచివాలయంలో ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ సీఈవో వీబీ గాడ్గిల్, ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి, స్పష్టమైన ప్రభుత్వం ఏర్పడినందున నిర్ణయాలను వేగంగా తీసుకుని మెట్రోరైల్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మెట్రో రైల్ సీఈవో గాడ్గిల్ కు సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్వహణ సాధ్యం కాదని, ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని సీఎం వారికి వివరించారు.

పెరుగుతున్న రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్న మొదటి దశ పనులను పూర్తిచేసి మరో 130 కిలోమీటర్లు విస్తరించాలని, ఇందుకు అవసరమైన ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ వారికి స్పష్టం చేశారు. ఇదిలాఉండగా మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండవ దశ పనులను చేపట్టే అంశానికి సంబంధించి కేంద్రంతో చర్చించేందుకు త్వరలో సీఎస్ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *