నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలోని అలంపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులున్న నడిగడ్డలో రెండు నియోజకవర్గాల్లో గెలిచాం. మనం ఓడిపోయినప్పటికీ 39 సీట్లు గెలిచాం.. 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని ఓటర్లు బాధ్యత అప్పగించారు అని పేర్కొన్నారు.
మనం ఓటమి పాలు కాగానే ఎన్నో పదవులు అనుభవించిన వారు స్వార్థంగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు సూటిపోటి మాటలతో 75 ఏళ్ల కేసీఆర్‌ను అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.. కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేశారు. ఇలా పార్టీ చాలా కష్టాల్లో ఉన్న సమయంలో మన పార్టీలోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ గారి గురించి చెప్పుకోవాలె అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ అధికార పార్టీని కాదని బీఆర్ఎస్‌కు వచ్చిన ధీశాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యతోనే వికాసం వస్తుందని భావించి గురుకులను సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆణిముత్యాలను తయారు చేశారు ప్రవీణ్ కుమార్ గారు. అధికారిగానే ఇన్ని మంచి పనులు చేస్తే.. ప్రజాప్రతినిధిగా ఎన్ని పనులు చేస్తారో తెలుసుకోండి అని తెలిపారు.
ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే గెలిచారన్న టాక్ వచ్చేసింది. ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే మన ప్రాంత సమస్యలను లోక్‌సభలో సమర్థవంతంగా ఆయన ప్రస్తావిస్తారు అని కేటీఆర్ అన్నారు.
ఒక్కసారి మోసపోతే తప్పు మోసం చేసినవాడిదే.. రెండో సారి మోసపోతే మాత్రం మోసపోయిన వాళ్లదే తప్పు. బహుబలి పార్ట్ -1, బహుబలి పార్ట్ -2 సినిమా చూశారా? రేవంత్ రెడ్డి గారు కూడా మోసం పార్ట్-1, మోసం పార్ట్-2 అనుకుంటా వస్తున్నాడు అని దుయ్యబట్టారు.
డిసెంబర్ 9 నాడే రెండు లక్షలు రుణమాఫీ చేస్త అన్నాడా? లేడా. ఇప్పుడు మాత్రం రుణమాఫీ ఆగస్ట్ 15 నాటికి వేస్తాడంట.. రైతుబంధు వేయనోడు.. రైతు రుణమాఫీ చేస్తాడంట నమ్ముదమా? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని అని చెప్పి మోసం చేస్తున్న నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కూర్చున్నాడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అంటాడు. లంకె బిందెల కోసం దొంగలే కదా వెతికేది? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు. సీఎం స్థాయి వ్యక్తి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడా? అని అడిగారు.
రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రుణమాఫీ చేసి మాట్లాడు.. మగాడివైతే మహిళలకు నెలకు రూ. 2500, మగాడివైతే వృద్ధులకు నెలకు రూ. 4 వేలు వెయ్. రైతుబంధు, రైతుభరోసా, కౌలు రైతులకు సాయం అంటివి.. ఏవీ అవన్నీ.. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు . ఇక్కడి వచ్చి కూడా జోగులాంబ అమ్మవారి పై కూడా ఒట్టు వేస్తాడు. మోసపోవద్దు అని కేటీఆర్ హెచ్చరించారు.
నాగర్ కర్నూల్‌లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎంతో మెరుగైన అభ్యర్థి మన ప్రవీణ్ కుమార్ గారు. పాలమూరు అంటేనే ఒకప్పుడు వలసల ప్రాంతం. అలాంటిది ఇతర రాష్ట్రాల నుంచి మన వద్దకు వలసలు వచ్చే పరిస్థితిని కేసీఆర్ గారు తెచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, కరెంట్‌కు బాధ లేదు. రైతు బంధు టింగ్, టింగ్ మని పడేది. కానీ కాంగ్రెసోళ్లు కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చారు అని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఇప్పటికే ఆర్డీఎస్‌ను పూర్తి చేసే వాళ్లం.. 8 నుంచి 10 స్థానాలు మనం గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. తులం బంగారం, స్కూటీలు, రూ. 2500 అని ఏమీ చేయలేదని మహిళలు కోపంగా ఉన్నారు అని పేర్కొన్నారు.
కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నేనిచ్చిన ఉద్యోగాలని రేవంత్ రెడ్డి చెప్పుకుంటే విద్యార్థులు కోపంగా ఉన్నారు..100 రోజుల్లోనే కాంగ్రెస్ మీద ఉన్న భ్రమలన్ని తొలిగిపోయాయి. దేశానికి, రాష్ట్రానికి, నాగర్‌కర్నూల్‌కు ఏమీ చేశారంటే బీజేపోళ్లకు చెప్పేందుకు ఒక్కటి లేదు. అందుకే దేవుని పేరు పెట్టుకొని రాజకీయాలు చేసే పనిలో పడ్డారు అని ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల వాటా తేల్చలేదు.. మన 7 మండలాలను ఆంధ్రాలో కలిపిండు.. ఒక్క మెడికల్ కాలేజ్, నవోదయ స్కూల్ కూడా మంజూరు చేయని దుర్మార్గుడు మోడీ. జన్ ధన్ ఖాతా తెరవండి. అందరి ఖాతాలో రూ. 15 లక్షలు అన్నాడు. మీకు వచ్చాయా? 2 కోట్ల ఉద్యోగాలు, రైతు ఆదాయం రెట్టింపు, ప్రతి మనిషి ఇళ్లు అన్నాడు.. ఏదీ చేయలేదు. దేవున్ని అడ్డం పెట్టుకొని మాత్రమే నాకు ఓటు వేయాలని మోడీ అడుగుతున్నాడు. యాదగిరి గుట్ట మనం కూడా కట్టాం.. కానీ దేవుని పేరుతో రాజకీయం చేయలేదు. మోడీ గారు అక్షింతలు పంపితే.. కేసీఆర్ గారు దేశానికి అన్నం పెట్టే విధంగా బియ్యం పండించే పని చేశారు అని వ్యాఖ్యానించారు.
పేదలు, రాష్ట్రం మంచి కోసమే ఎప్పుడు కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రభుత్వం రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు.. తెలంగాణలో మన పార్టీకి 10 ఎంపీలు గెలిపించి అప్పజెప్పండి. పాత పంచాయితీలు, మన మధ్య ఉండే కోపలను పట్టించుకోవద్దు.. ఇవి అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం ఆని కోరారు.
లోక్‌సభలో తెలంగాణకు గొంతు ఉండాలంటే.. అది బీఆర్ఎస్‌తో మాత్రమే సాధ్యం.. తెలంగాణకు శ్రీరామరక్ష అంటే అది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.