mt_logo

వైదొలిగే చాన్సే లేదు..

-రాయితీల కోసం కార్పొరేట్ తరహా బ్లాక్‌మెయిలింగ్
-ఏపీ ప్రాజెక్టులు చేపట్టే యోచనలో ఎల్‌అండ్‌టీ సంస్థ
-మొదటి నుంచి తెలంగాణ సర్కారుతో అంటిముట్టనట్లు వ్యవహారం
-అలైన్‌మెంట్ మారితే ఎల్‌అండ్‌టీకి వచ్చిన నష్టమేంటి..?
-40 లక్షలు జనాభా పెరిగితే ప్రయాణికులు తగ్గుతారనడం ఎంతవరకు వాస్తవం?
-నిర్మాణ వ్యయం పెరిగితే ప్రభుత్వానికి సంబంధమేంటి..?
-భూసేకరణ, నష్టపరిహారంపై ప్రభుత్వం భరోసా
-ఒప్పందం ప్రకారం 260 ఎకరాలే.. అదనంగా 70 ఎకరాల కేటాయింపు

మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతామంటూ కాంట్రాక్ట్ సంస్థ ఎల్‌అండ్‌టీ లేఖ రాసిందని కొన్ని ప్రతికల్లో వచ్చిన కథనాలతో సర్వత్రా చర్చ సాగుతోంది. అసలు.. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మారిస్తే..గుత్తేదారుకు ఏం నష్టం..? ప్రభుత్వం భరిస్తానంది కదా. నిర్మాణ వ్యయం పెరిగితే..సర్కార్‌కు సంబంధమేంటి..? ప్రాజెక్ట్ ప్రారంభంలో నగరంలో 80 లక్షల జనాభా ఉండగా.. తాజా సర్వే ప్రకారం అది కోటికి చేరినట్లు అంచనా. అలాంటప్పుడు ప్రయాణికులు ఎలా తగ్గుతారు..? మరి.. ఇలాంటి అసత్య ఆరోపణలు, కుంటి సాకులు చెబుతూ.. కాంట్రాక్ట్ రద్దుచేసుకునే అవకాశం ఉందా అంటే.. నూటికినూరు శాతం లేదనే చెప్పాలి.

ప్రభుత్వం నుంచి అదనంగా లబ్ధిపొందడం కోసమే.. ఎల్అండ్‌టీ కార్పొరేట్ తరహా బెదిరింపులకు పాల్పొడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా చేపట్టబోయే మూడు ప్రాజెక్టులను కైవసం చేసుకోవడం కోసమే కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులు ఇలాంటి లేఖలు, లీకుల తతంగాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. పీపీపీ పద్ధతిలో చేపట్టిన ప్రాజెక్ట్‌లో 90 శాతం పెట్టుబడిని కాంట్రాక్టరే భరించాల్సి ఉంది. కేవలం 10 శాతం మాత్రమే కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిమిత్తమాత్రమే. అయినా సర్కార్‌ను, హైదరాబాద్‌ను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని లీకులు చేస్తున్నారని వినికిడి.

నగరకీర్తిని పతాకస్థాయికి తీసుకెళ్లే మెట్రోరైలు ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ వైదొలుగుతామని… ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ పత్రికల్లో వస్తున్న కథనాల నేపథ్యంలో అసలు ఎల్‌అండ్‌టీ వైదొలగడానికి అవకాశం ఉందా..? ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చా..? ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ఒప్పందాల్లో అలాంటి వాటికి అస్కారం ఉంటుందా..? అంటే నూటికినూరుశాతం ఆస్కారమే లేదని ప్రాజెక్ట్ ఒప్పందాన్ని బట్టి తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఒప్పందంలోని 34 క్లాజు, ఫోర్స్‌మెజూర్ ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లు, భూకంపాలు, యుద్ధాలు, అంతర్గత రాజకీయ అస్థిరత, చట్టాల్లో ఆకస్మిక మార్పులు లాంటి విపత్కర పరిస్థితులు వస్తే తప్ప ప్రాజెక్ట్ నుంచి వైదొలిగే అవకాశం లేదు. అది ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైతేనే. వీటికి విరుద్ధంగా ఆర్థికాంశాలు, ఇతర కారణాలను చూపించి వైదొలిగే అవకాశమే లేదు. తాజాగా ఎల్‌అంట్‌టీ ఫోర్స్‌మెజూర్‌లో వెల్లడించిన కారణాలను చూపించడం లేదు. అలాంటప్పుడు వైదొలగడానికి అవకాశమే లేదన్నది న్యాయనిపుణుల వాదన.

ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వైదొలిగినా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదిలావుంటే అదనపు భూ కేటాయింపులు, రాయితీల కోసమే, ఎల్‌అండ్‌టీ కార్పొరేట్ తరహా బెదిరింపులకు పాల్పడుతోందని ప్రజాసంఘాల నేతలు , రవాణారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరాన్ని ప్రచారం చేసి, తమకు లైన్‌క్లియర్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పేచీలు పెట్టడం కార్పొరేట్‌శక్తుల నైజమని, అందుకే పక్కా ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నారని వారంటున్నారు. ఒప్పందాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను ఎల్‌అండ్‌టీకి కట్టబెట్టినట్లు ఆరోపిస్తున్నారు.

అదనంగా 70 ఎకరాలు ఇచ్చినా..
వాస్తవంగా ఎల్‌అండ్‌టీ సంస్థకు కేవలం 260 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉండగా, అదనంగా మరో 70 ఎకరాలను తీసుకుందని, అప్పుడు సైతం ఇదే తరహా బెదిరింపులతోనే భూ కేటాయింపులతో లబ్ధిపొందేలా ఎల్‌అండ్‌టీ చక్రం తిప్పిందన్నది ప్రజాసంఘాల ఆరోపణ. ప్రభుత్వం సహకరిస్తున్నా.. అదనపు లబ్ధిలు, రాయితీలు కల్పిస్తున్నా, వీటన్నింటిని విస్మరించి ఎల్‌అండ్‌టీ తరచూ వైదొలగుతామనడం బెదిరింపుల్లో భాగమేనని ఆ సంఘాలు అంటున్నాయి.

అలైన్‌మెంట్ మారితే ఎల్‌అండ్‌టీకి నష్టమేంటి..?
ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రో అలైన్‌మెంట్ మారితే నష్టం వస్తుందన్న ఎల్‌అండ్‌టీ వాదన పూర్తి నిరాధారమైనది. ముఖ్యమంత్రి చెప్పినట్లు అలైన్‌మెంట్ మార్చితే.. నష్టపరిహారాన్ని చెల్లించడానికి ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఎలాగు ఆస్తులు, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా హెచ్‌ఎంఆరే ప్రభుత్వ ఏజన్సీగా చేపట్టాలి. దానికి ఎల్‌అండ్‌టీకి సంబంధమేలేదు. పాత అలైన్‌మెంట్‌లో లక్డీకాపూల్-నాంపల్లి మధ్య చేపట్టిన పనులు అంతంత మాత్రమే. అయినా పెద్దమనసు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ఎంతైనా చెల్లిస్తామని భరోసా కూడా ఇచ్చింది. ఏకంగా ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. అయినా ఎల్‌అండ్‌టీకి వచ్చిన ఇబ్బందులేంటో అర్థంకాని పరిస్థితి.

నిర్మాణ వ్యయం పెరిగితే ప్రభుత్వానికి సంబంధమేంటి..?
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే ప్రభుత్వానికి సంబంధమేంటో తెలియాల్సి ఉంది. పీపీపీ పద్ధతిలో చేపట్టిన ప్రాజెక్ట్‌లో 90 శాతం పెట్టుబడిని సదరు కాంట్రాక్టు సంస్థే భరించాల్సి ఉంది. కేవలం 10శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిమిత్త మాత్రమే.. అయినా ప్రభుత్వంతో ముడిపెట్టడం అసంబద్ధం. ఒకవేళ నిర్మాణ వ్యయం తగ్గితే ప్రాజెక్టు విలువ తగ్గించుకుని, ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన రాయితీలను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమేనా..? అన్న ప్రశ్నలు ప్రజా సంఘాలు, కార్పొరేట్ వర్గాల నుంచి వెలువడుతున్నాయి.

జనాభా పెరిగితే.. ప్రయాణికులు ఎక్కడైనా తగ్గుతారా..?
ఓవైపు నగర జనాభా పెరుగుతుంటే..ప్రయాణికుల సంఖ్య తగ్గుతోందని ఎల్‌అండ్‌టీ వింతగా వాదిస్తోంది. కన్షెషనరీ ఒప్పందం ప్రకారం అప్పట్లో జీహెచ్‌ఎంసీ జనాభాను 80 లక్షలుగా చూపించారు. గంటకు 30 రైళ్లను నడిపి 60 వేల మందిని గమ్యం చేర్చే అవకాశం ఉందని, 14 గంటల పాటు రైళ్లు నడిస్తే సుమారుగా 8.40 లక్షల మందిని రోజు గమ్యం చేరుస్తామంటూ సాక్షాత్తూ ఎల్‌అండ్‌టీ వర్గాలే చెప్పాయి. అది అప్పటి సంగతి కాగా తాజాగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్ జనాభా కోటి 20 లక్షలకు చేరిందని ప్రభుత్వ వర్గాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఒప్పందం తర్వాత 40 లక్షల జనాభా పెరిగితే ప్రయాణికుల సంఖ్య ఎలా తగ్గుతుందో ఎల్ అండ్‌టీ చెప్పాల్సి ఉంది. ప్రయాణికుల లభ్యతపై గతంలో ఎల్అండ్‌టీ మూడు సర్వేలు నిర్వహించింది. అవన్నీ రాష్ట్ర విభజనకు ముందు చేపట్టినవే. తాజాగా ప్రయాణికుల లభ్యతపై మరోసారి సర్వే చేపట్టే యోచన ఉండదని సంస్థ వర్గాలు పక్షం రోజుల క్రితం వెల్లడించాయి. సర్వే జరపకుండానే, ఊహాజనితంగా ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని నిందలు వేయడం ఎల్‌అండ్‌టీకే చెల్లింది.

ఏపీ ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకే..?!
అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం కొత్తగా చేపట్టబోయే మూడు మెట్రోరైలు ప్రాజెక్ట్‌లను కైవసం చేసుకోవాలని ఎల్అండ్‌టీ యోచిస్తోంది. విశాఖపట్టణం, విజయవాడ-గుంటూరు-మంగళగిరి, తిరుపతిల్లో కొత్తగా మెట్రో ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నారు. వీటిపై కన్నెసిన ఎల్‌అండ్‌టీ ఇప్పటికే విజయవాడ, వైజాగ్‌లకు సర్వే బృందాలను పంపించి అధ్యయనం చేయించింది. కానీ అక్కడి భౌగోళిక పరిస్థితులు మెట్రో ప్రాజెక్టులకు అంత అనుకూలం కాదని ఎల్‌అండ్‌టీలోని అధికారిక వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. కాని ఎల్‌అండ్‌టీ మెట్రోను ముందుండి నడిపిస్తున్న కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులు ఏపీ ప్రాజెక్ట్‌లు చేపట్టేలా ఒత్తిళ్లు తెస్తున్నారని, లేఖలు, లీకుల తతంగాన్ని వారే నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. వారికి పక్క రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

మొదటి నుంచి అంటిముట్టనట్లుగానే..
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం..అనంతరం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అన్ని వర్గాలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపాయి. కాని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థయిన ఎల్‌అండ్‌టీ మాత్రం సీఎంను కలిసేందుకు ఇష్టపడలేదు. హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాత్రమే ప్రత్యేకంగా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేవలం అధికారికంగా సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మాత్రమే ఎల్అండ్‌టీ ప్రతినిధులు హాజరయ్యారు.

మొదటి నుంచి టీ-ప్రభుత్వంతో ఎల్‌అండ్‌టీ సంస్థ అంటిముట్టనట్లు వ్యవహారిస్తోందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అంతేకాకుండా మెట్రో ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెట్రోను 200 కిలోమీటర్లకు విస్తరిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. రెండోదశ ప్రాజెక్ట్ అనుమతుల కోసం త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఢిల్లీకి వెళ్లనున్నారు. వీటన్నింటిని పక్కనబెట్టి ఎల్‌అండ్‌టీ కాస్త దూకుడుగా వ్యవహరించి తప్పు చేసిందని కార్పొరేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Source: [నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *