mt_logo

తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడితో అమూల్ డెయిరీ ప్లాంట్.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో మరో శ్వేత విప్లవం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాడి పరిశ్రమ ప్రోత్సాహకాల వల్ల దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ 500 కోట్ల పెట్టుబడితో తన ప్లాంటును తెలంగాణాలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం అమూల్ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లో రెండు దశల్లో ఈ సంస్థ పెట్టుబడి పెడుతుంది. తొలుత రోజుకు 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటును ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దీన్ని రోజుకు పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యానికి విస్తరిస్తారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు దక్షిణ భారతదేశంలో మొదటిదని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పాలతోపాటు బటర్‌మిల్క్‌, పెరుగు, లస్సీ, పన్నీర్‌, స్వీట్లు తదితరాలను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తామన్నారు. దీంతోపాటు బేకరీ ప్రొడక్షన్‌ డివిజన్‌ను కూడా ఏర్పాటుచేసి బ్రెడ్‌, బిస్కెట్‌, ఇతర బేకరీ ఉత్పత్తులను తయారుచేస్తామన్నారు. ఈ ప్లాంటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్లాంటుకు అవసరమైన పాలను తెలంగాణ రైతులనుంచే సేకరిస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలోని పాడిరైతులను కూడా ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అమూల్‌ కంపెనీ తరఫున గుజరాత్‌లోని సాబర్‌కాంఠా జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ యూనియన్‌ ఎండీ బాబూభాయ్‌ ఎం పటేల్‌, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అమూల్‌ ఎండీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ సోది వ్యక్తిగత కారణాల వల్ల ఎంవోయూ కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్టు, త్వరలో జరిగే కంపెనీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు.

రాష్ట్రంలో శ్వేతవిప్లవం : కేటీఆర్

తెలంగాణలో అమూల్‌ భవిష్యత్తు ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అమూల్‌ తొలి డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడంపట్ల కంపెనీ ప్రతినిధులను అభినందించారు. తెలంగాణలో పారిశ్రామికరంగంతోపాటు అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా వ్యవసాయరంగ అభివృద్ధి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పాడిరంగం భారీగా అభివృద్ధి చెందిందని, తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి పెట్టేందుకు అమూల్‌ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అమూల్‌ దేశ పాడి పరిశ్రమ రూపురేఖలు మార్చిందని, ప్రపంచానికి పాడి రంగంలో గొప్ప పాఠాలు చెప్పిన కంపెనీ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ‘వెల్‌కమ్‌ అమూల్‌ టు తెలంగాణ’ అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌తోపాటు పరిశ్రమలశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *