mt_logo

ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే.. అన్నట్లుంది – కేటీఆర్

-టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేస్తున్నారు
-ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే.. అన్నట్లుంది
-ఆ రెండు పార్టీల ద్రోహానికి గణాంకాలే సాక్ష్యం
-బొగ్గులేని సీమాంధ్రలో ప్రాజెక్టులు పెట్టారు
-తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ ఏది?
-పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-కాంగ్రెస్, టీడీపీలకు 22 ప్రశ్నలతో బహిరంగ లేఖ
తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ఈ అంశంపై తన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల తీరు ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుందని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమన్నట్లు కాంగ్రెస్, టీడీపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, టీడీపీకు 22 ప్రశ్నలతో కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

మొన్నటివరకు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీల తెలంగాణ వ్యతిరేక విధానాలతోనే ఈరోజు ఈ కరెంటు సమస్య వచ్చిందన్న వాస్తవాన్ని విస్మరించి, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేస్తున్నారని పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని వనరులున్నా, ఎందుకు తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించలేకపోయిందని నిలదీశారు. 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు పాలించిన టీడీపీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని గణాంకాలే చెబుతాయన్నారు.

అపారమైన సింగరేణి బొగ్గు గనులున్నా తెలంగాణలో చేపట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఎంత? తట్టెడు బొగ్గు లేని సీమాంధ్రలో చేపట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఎంత? అనే విషయం టీడీపీ, కాంగ్రెస్‌లకు తెలియదా? అని ప్రశ్నించారు. మొత్తం తెలంగాణలో 2282.5మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే, సీమాంధ్రలో ఇంతకు రెట్టింపుగా 4410 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. దీన్నిబట్టి మీ పార్టీల పక్షపాతమేందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. బొగ్గు నిల్వలు లేని విజయవాడలో వీటీపీఎస్‌ద్వారా 1760 మెగావాట్లు, కృష్ణపట్నంలో కేటీపీఎస్‌ద్వారా 1600 మెగావాట్లు, బొగ్గు, నీరులేని కడపలో ఆర్టీపీసీ ద్వారా 1050 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేసి తెలంగాణ పట్ల వివక్ష చూపింది టీడీపీ, కాంగ్రెస్‌లు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఆంధ్రాలో థర్మల్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా, పక్కనే బొగ్గుతోపాటు అన్నీ వనరులున్నా రామగుండంలో 1320 మె.వా., సత్తుపల్లిలో 600, కేటీపీఎస్‌లో 800, భూపాలపల్లిలో 300 మొత్తం 3520 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు అటకెక్కడానికి కారణం ఆ రెండు పార్టీల నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులను సకాలంలో నిర్మించి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ విద్యుత్‌రంగంలో స్వయం సమృద్ధి సాధించేదన్న మాట వాస్తవం కాదా? అని కేటీఆర్ నిలదీశారు.

తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉందంటూ మొసలి కన్నీరు కారుస్తున్న టీడీపీ, కాంగ్రెస్‌లు.. చంద్రబాబు పీపీఏలను రద్దు చేసినా, కేటీపీఎస్, వీటీపీఎఎస్, సీలేరు, ఆర్టీపీపీల నుంచి తెలంగాణ వాటాను ఆంధ్ర రాష్ట్రం లాక్కున్నా ఒక్క మాట మాట్లాడకపోవడానికి కారణం మీ పాపాలు బయటపడతాయనే భయంతో కాదా? అని ప్రశ్నించారు. 1969 నాటికే మొత్తం సమైక్య రాష్ట్రానికి సరిపడా విద్యుత్ తెలంగాణలోనే ఉత్పత్తి అయ్యేదని, దశాబ్దాల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ పరిస్థితి తారుమారైందన్నారు. నాటినుంచి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల విధానాలతోనే రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సమస్య తీవ్రతకు కారణమన్నారు. దమ్ముంటే తాను సంధించే ఈ ప్రశ్నలకు ఆ రెండు పార్టీల నేతలు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

కేటీఆర్ సంధించిన ప్రశ్నలు:
1. ఉమ్మడిరాష్ట్రంలో 1966లోనే ప్రతిపాదించిన కుంటాల, ప్రాణహిత, ఇచ్ఛంపల్లి, కంతానపల్లి, దిండి, సింగారెడ్డిపల్లి జల విద్యుత్ ప్లాంట్లను కట్టకుండా వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
2. 1971లో నిర్మించిన 62.5 మె.వా. రామగుండం బీ థర్మల్ పవర్ స్టేషన్‌ను విస్తరించకుండా కాంగ్రెస్ గాలికొదిలేయలేదా? 600 మెగావాట్ల సామర్థ్యంతో విస్తరించాలన్న ప్రతిపాదనల్ని ఎందుకు పట్టించుకోలేదు? అదే సమయంలో సీమాంధ్రలో వీటీపీఎస్‌లో ఏడు దశల్ని, ఆర్టీపీసీలో ఐదు దశల్ని విస్తరించుకొని పక్షపాతం చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
3. 1978లో మణుగూరులో ప్రతిపాదించిన 1760 మె.వా. థర్మల్ స్టేషన్‌ను విజయవాడకు తరలించింది కాంగ్రెస్ హయాంలో కాదా?
4. బీపీఎస్ పవర్‌ప్లాంట్‌ను 20ఏండ్లపాటు సవాలక్ష కారణాలతో పూర్తి చేయకుండా మూలకు పడేసింది మీ ప్రభుత్వాలే కాదా?
5. 2000లోనే అనుమతులు పొందిన శంకర్‌పల్లి గ్యాస్ విద్యుత్ ప్లాంట్‌కు ఇప్పటిదాకా గ్యాస్ కేటాయింపులు జరగకపోవడానికి నిన్న మొన్నటిదాకా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కారణం కాదా?
6. కరీంనగర్ జిల్లా నేదునూరులోని 2100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకి గ్యాస్ కేటాయింపులు ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు?
7. కేంద్రంలో, రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ రెండు ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి ఉంటే, తెలంగాణకు 3500 మెగావాట్ల విద్యుత్ అదనంగా దక్కేది. ఈ కరెంటు తిప్పలు ఉండేవి కాదు. ఈ నిర్లక్ష్యానికి కాంగ్రెస్ కారణం కాదా?
8. శంకర్‌పల్లి, నేదునూరు ప్రాజెక్టులతోపాటే అనుమతులు పొందిన జీవీకే, వేమగిరి, గౌతమి, కోనసీమవంటి ప్రైవేటు ప్లాంట్లు సకాలంలో ఉత్పత్తిని ప్రారంభించుకున్నాయి. కానీ తెలంగాణ ప్రాజెక్టులకు పునాది కూడా పడలేదంటే తెలంగాణలోని విద్యుత్ ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ పార్టీలకున్న చిత్తశుద్ధి అర్థమవడం లేదా?
9. 600 మెగావాట్ల సత్తుపల్లి థర్మల్ కేంద్రానికి ఎందుకు కోల్ లింకేజీ ఇవ్వలేదు? రాష్ట్రంలో జెన్‌కో ప్రాజెక్టు ఎందుకు మొదలు పెట్టలేదు?
10. తెలంగాణలోని విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులను గాలికొదిలి, రాష్ట్రానికి పూర్తి విద్యుత్ ఇవ్వని ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని 2008లో కేంద్రానికి లేఖ రాసింది కాంగ్రెస్ కాదా?
11. తెలంగాణ రాష్ట్రంపై కక్షకట్టి విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు రద్దు చేసినప్పుడు, సీలేరు ప్రాజెక్టులో వాటా ఇవ్వనప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నేతలెవరూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు?
12. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైనా ట్రయల్న్ పేరుతో దాదాపు 350-400 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రా ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?
13. సదరన్‌గ్రిడ్‌లో 2000 మె.వా. విద్యుత్ బుక్‌చేసుకునే అవకాశమున్నా నాటి కాంగ్రెస్ సీఎం కిరణ్ ఎందుకు పట్టించుకోలేదు?
14. తెలంగాణలో అన్ని వనరులున్నా ప్రాజెక్టులు లేకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాల సీమాంధ్ర పక్షపాతమే కారణం కాదా? మణుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ప్లాంట్ విజయవాడకు తరలిపోవడానికి కారణం ఎవరు? బొగ్గు, నీరు అసలే దొరకని కడప జిల్లాలో ఆర్‌టీపీసీని పెట్టి తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ కాదా?
15. తెలంగాణలో నిర్మించాల్సిన ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకో, ఎన్టీపీసీకో అప్పజెప్పి, సీమాంధ్రలోని ప్రాజెక్టులను ప్రభుత్వమే నిర్మించింది వాస్తవం కాదా?
16. ప్రైవేటు ప్లాంట్లకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చి, ఒప్పందాలు చేసుకున్న విధానాల ఫలితంగా ఇప్పుడు ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నా వందల కోట్లను ఆయా ప్లాంట్లకు ఫిక్స్‌డ్ చార్జీ రూపంలో చెల్లించాల్సి వస్తున్నది. ఈ పాపం కాంగ్రెస్, టీడీపీలది కాదా?
17. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు వేయకుండా పాలించిన మీ ప్రభుత్వాల దూరదృష్టి లోపంవల్లనే ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడింది. 2001లో హైదరాబాద్ విద్యుత్ డిమాండ్ సుమారు 1400 మెగావాట్లు ఉంటే ప్రస్తుతం 2200 మెగావాట్లకు చేరింది. రాజధానిలో పెరిగిన ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తీసుకున్న చర్యలు ఏమిటి?
18. ఇతర రాష్ట్రాలనుంచి కరెంటు కొనే వీలులేకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం జరుగకపోవడానికి కారణం ఎవరు?
19. రాయచూర్ నుంచి కర్నూలు, కృష్ణపట్నం మీదుగా శ్రీకాకుళం వరకు 765 కేవీ ఇంటర్‌స్టేట్ విద్యుత్‌లైన్ వేసినా ఒక్కచోట కూడా తెలంగాణ ప్రాంతానికి కనెక్టివిటీ లేకపోవడానికి కారణం ఎవరు?
20. కట్టని ప్రాజెక్టులను కట్టినట్లు, త్వరలోనే మొదలవుతాయని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది నిజం కాదా? కనీసం తట్టెడు మట్టి తీయని కరీంనగర్ గ్యాస్ ప్లాంట్ ప్రారంభమైనట్టు మోసపుచ్చుతున్నది అవాస్తవమా?
21. తెలంగాణలో 8418 మెగావాట్లకు సగం కూడా ఉత్పత్తి అవడం లేదన్నది అసలైన వాస్తవం. దీనిని మరుగునపెట్టడం కేవలం టీఆర్‌ఎస్‌పై నిందలు వేయడానికే అని అర్థమవుతున్నది. కేవలం స్థాపిత సామర్థ్యాన్ని చూపి, అందుబాటులో ఉన్న విద్యుత్ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. స్థాపిత సామర్థ్యానికి కనీసం 20 శాతం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ వాస్తవాన్ని మరిచి అసత్యాలతో ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు?
22. కాంగ్రెస్, టీడీపీలు చెబుతున్నట్టుగా రోజువారీ డిమాండ్ 120-145 మిలియన్ యూనిట్లే ఉంటే ఒక్క నిమిషం పవర్‌కట్ లేకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను సరఫరా చేసేది. ఈ వారంలో సరాసరి 140-149 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. విద్యుత్ డిమాండ్ సరాసరి 165-171 మిలియన్ యూనిట్లకు పెరగడంతోనే విద్యుత్ కొరత ఏర్పడింది. వాస్తవాలను మరుగున పరిచి, కేవలం పాత లెక్కలతో ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న దుష్ప్రచారం వారి నైజాన్ని బయటపెడుతున్నది.

విద్యుత్ కొరత తీర్చడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు
1. ఐదున్నర దశాబ్దాలుగా ఎవరూ ప్రయత్నించని వార్ధా టూ డిచ్‌పల్లి, తెలంగాణ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మించేందుకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ తరఫున టెండర్లను పిలిచాం.
2. మొత్తం దక్షిణ భారతదేశ గ్రిడ్‌లోని ఐపెక్స్‌లో అందుబాటులో ఉన్న మొత్తం 20 మి.యూ. విద్యుత్ ఉత్పత్తిలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా 17.5 మి.యూ.లను రూ.8.87కు కొనుగోలు చేసిందంటే విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తున్నదో తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఎనర్జీ ఎక్సేంజి నుంచి సరాసరి 14 మి.యూ.లను కొనుగోలు చేస్తున్నది.
3. తెలంగాణలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ప్రైవేటు కంపెనీలతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌తో చేసుకున్న ఒప్పందం మా ప్రభుత్వ పారదర్శకతకు అద్దం పడుతుంది.
4. విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు తక్షణ ప్రణాళికగా 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లను పూర్తి చేయబోతున్నాం.
5. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2000 మెగావాట్ల కొనుగొలుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *