ఫార్ములా-ఈ కేస్ రాజకీయ ప్రేరేపితమైనది.. చాలా లూప్‌హోల్స్ ఉన్నాయి అని ప్రముఖ సీనియర్ న్యాయవాది సీఏ సుందరం హైకోర్టులు వాదించారు. ఫార్ములా-ఈ కేస్ కొట్టేయాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్‌పై కేటీఆర్ తరఫున న్యాయవాది సీఏ సుందరం వాదనలు వినిపించారు
డిసెంబర్ 18న సాయంత్రం 5.30కు ఏసీబీ కేసు నమోదైతే.. డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఎటువంటి ప్రాథమిక విచారణ చేయకుండానే.. కేవలం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనే అంశాన్ని కోర్టులో సుందరం లేవనెత్తారు.
ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేముందు సరిగ్గా విచారించకుండానే సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు అని ఎత్తిచూపిన సుందరం.. ఎలాంటి నేరపూరితమైన చర్య లేకుండా అవినీతి నిరోధక చట్టం 13(1)(a) సెక్షన్ కింద అసలు కేసు ఎలా నమోదు చేశారు అని ప్రశ్నించారు.
ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం సరైనదా కాదా అనే నిర్ణయాన్ని కొత్త (కాంగ్రెస్) ప్రభుత్వం తీసుకోవచ్చు.. కాని అవినీతి నిరోధక చట్టం 13(1)(a) సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి ఆస్కారమే లేదు అని స్పష్టం చేస్తూ.. సదరు డబ్బును కేటీఆర్ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోలేదని.. అలా వాడుకున్నాడని అసలు వాళ్ళు పెట్టిన కేసులోనే లేదని గుర్తుచేశారు.
డబ్బు అందుకున్న ఫార్ములా-ఈ నిర్వాహకులను కనీసం నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొనలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఆర్బిట్రేషన్ కేస్ పెండింగ్ ఉంది కాబట్టే వాళ్లను నిందితులుగా చేర్చలేదు. ఈ కేస్‌లో ఇలాంటి లూప్‌హోల్స్ చాలా ఉన్నాయి అని న్యాయస్థానానికి సుందరం తెలిపారు.
డబ్బు బదిలీ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారు.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేస్ తప్ప ఇంకోటి కాదు. ఒక్క రూపాయి కూడా కేటీఆర్‌కు వచ్చినట్టు రుజువు లేదు, కేస్‌లో అటువంటి ఆరోపణ కూడా లేదు అని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సుందరం.. వీటన్నింటిని పరిగణిస్తూ.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు కూడా విన్న అనంతరం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా-ఈ కేస్ ఎఫ్ఐఆర్‌లో కావాల్సినంత సరుకు లేదని పేర్కొన్న హైకోర్టు.. ఈ కేసుని మరింత పరిశీలించాలని అభిప్రాయపడింది. ఫార్ములా-ఈ కేస్‌లో డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.