mt_logo

నిరుపేద అక్కాచెల్లెళ్ల చదువుకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్

మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న నిరుపేద అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం అందించారు. వారిరువురి చదువులు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే… జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాకు చెందిన రాజ‌మల్లు ప్రైవేటు పాఠశాల‌లో టీచ‌ర్‌గా ప‌నిచేశాడు. కోవిడ్ వ‌ల్ల ఉద్యోగం పోయి, రోజు వారి కూలీగా మారాడు. కూలీ ప‌నులు చేస్తూ త‌న పిల్ల‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చ‌దివించాడు. త‌నకు ఇద్ద‌రు కూతుళ్లలో కావేరీ ఇంట‌ర్మీడియెట్‌లో 95 శాతం మార్కుల‌తో పాటు సిద్ధిపేట‌లోని సుర‌భి మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించింది. మరో కూతురు శ్రావ‌ణి కూడా ఇంట‌ర్మీడియెట్‌లో 97 శాతం ఉత్తీర్ణ‌త సాధించి ఏపీలోని ఎన్ఐటీ తాడెప‌ల్లిగూడెంలో ఉన్న ఎన్ఐటీలో బీటెక్ సీటు సంపాదించింది. ఇద్ద‌రికీ త‌మ మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో ఉచిత సీటు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. మిగితా పరీక్ష‌, ట్యూష‌న్ ఫీజులు, హాస్ట‌ల్‌, మెస్ ఫీజులు చెల్లించ‌డం చాలా క‌ష్టంగా మారింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఇద్ద‌రు అక్కాచెళ్లెళ్లు మెడిసిన్, ఇంజనీరింగ్ పూర్తి చేసే దాకా.. అయ్యే ఖ‌ర్చును తానే భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈసంద‌ర్భంగా ఇద్ద‌రు విద్యార్థినులు త‌న తండ్రితో పాటు మంత్రి కేటీఆర్‌ను హైద‌రాబాద్‌లో క‌లిశారు. ఇద్ద‌రు విద్యార్థినుల‌తో మంత్రి కేటీఆర్ కాసేపు మాట్లాడారు. వాళ్ల చ‌దువు గురించి వాక‌బు చేశారు. వాళ్ల‌కు అండ‌గా ఉంటాన‌ని మాటిచ్చారు. అనంత‌రం మంత్రి కేటీఆర్‌.. వాళ్ల‌కు చెక్‌ను అంద‌జేశారు. త‌మ ఉన్న‌త చ‌దువుల కోసం ఆర్థిక సాయం అందించినందుకు సంతోషం వ్యక్తం చేసిన ఈ అక్కాచెల్లెళ్లు… మంత్రి కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *