బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లాకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు… నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని కేటీఆర్ అన్నారు.
‘‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు. మరో వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు. గుజరాత్‌కు గత ఐదు నెలల్లో రూ.80 వేల కోట్ల ప్యాకేజీలు. తెలంగాణకు కనీసం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా..? నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకి రూ.19వేల కోట్లు కేటాయించామని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు. రాజకీయ ప్రయోజనం కోసం ఓ వ్యక్తికి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. మోడీ గారూ ఇప్పటికైనా నల్లగొండ జిల్లాకు రూ.18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీనుంచి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా..?’’ అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.