mt_logo

తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్‌, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం

తెలంగాణ రైతుల నెత్తిన కొత్త పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన భూ భారతి చట్టం ద్వారా అనుభవదారు కాలమ్‌, వీఆర్వో వ్యవస్థ తిరిగి రానున్నాయి.

తెలంగాణ ఏర్పడక ముందు రైతులను, భూ యజమానులకు హడలెత్తించిన కాస్తు కాలమ్‌/అనుభవదారు కాలమ్‌ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అనుభవదారు కాలమ్‌ని దుర్వినియోగం చేస్తూ.. కొందరు అక్రమార్కులు భూములు లాక్కుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వం పాస్ బుక్కుల్లో ఈ కాలమ్‌ని రద్దు చేసింది.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ‘భూ భారతి’ పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలమ్‌ను చేర్చింది. పైగా 2014 వరకు రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్న వారి పేర్లను చేర్చి.. వారికి హక్కులు సైతం కల్పిస్తామని చెప్పింది. దీంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.

గతంలో అనుభవదారు కాలమ్‌ వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై.. రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్‌లో పేరు రాయించుకునేవారు. కొన్నేండ్లు అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదారు కాలమ్‌లోకి మార్చి.. అసలు రైతు పేరును తొలిగించేవారు. రైతులు తమ భూమిని అమ్ముదాం అని ప్రయత్నించినప్పుడు ఈ విషయం బయటపడి గొడవలకు, కేసులకు దారి తీసేది.

అనుభవదారు కాలమ్‌ వల్ల రికార్డుల్లో అక్రమార్కుల పేర్లే ఉండేసరికి కోర్టుల్లో కూడా పెద్దగా ఊరట లభించక రైతులు తమ భూములను కొల్పోయేవారు. అనుభవదారు కాలమ్‌తో రైతులకే కాదు ప్రభుత్వ భూములు, దేవుడి మాన్యాలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి.

ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే కౌలు పేరుతో పొలాన్ని కిరాయికి ఇస్తారు. కబ్జాదారు కాలమ్‌ పెట్టి కిరాయికి ఉన్న వ్యక్తికి ఇంటిపై హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటారా? మరి కౌలుకు తీసుకున్న వారికి భూమిపై హక్కులు ఎందుకు ఇవ్వాలి? అని కేసీఆర్‌ పదే పదే ప్రశ్నించేవారు.

దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ వ్యవస్థను వాడుకొని కొందరు వీఆర్వోలు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. భూ అక్రమాలకు పాల్పడ్డారనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అధికారాలున్న ఈ ప్రమాదకరమైన వ్యవస్థ వల్ల రైతులకు తీవ్ర నష్టమని కేసీఆర్ దీన్ని రద్దు చేశాడు. ఇప్పుడు వీఆర్వోలను తిరిగి తీసుకొచ్చి రేవంత్ సర్కార్ రైతులను బెంబేలెత్తిస్తుంది.

పదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెల్లో ఇప్పుడీ భూ భారతి చట్టం వల్ల భూ తగాదాలు, గట్టు పంచాయితీలు పునరావృతమవుతాయి.