mt_logo

బీఆర్ఎస్ పార్టీకి పెన్షన్లు, కూలీ డబ్బులు విరాళమిచ్చిన ముఖ్రా కె గ్రామస్తులు

సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి మంచి అనుకూల స్పందన వస్తోంది. వివిధ రాష్ట్రాల నుండే కాకుండా తెలంగాణలో కేసీఆర్ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు ముక్తకంఠంతో కేసీఆర్‎కు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కూలీలు తమ పంట మొత్తాన్ని బీఆర్ఎస్‎కు విరాళంగా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామానికి చెందిన దళితబస్తీ వాసులు తాము పండించిన సోయా పంట మొత్తానికి వచ్చే రూ.66,000 లను బీఆర్ఎస్‎కు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇదే గ్రామానికి చెందిన కొంతమంది పెన్షన్ దారులు మనిషికి 1000 రూపాయల చొప్పున రూ.50000 కలిపి.. మొత్తం రూ.1,16,000 లను బీఆర్ఎస్ పార్టీకి విరాళమిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే దేశంలో మాలాంటి ఎన్నో కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉండి ఆదుకుంటారని వారు అన్నారు. నేడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్నందుకు అనందంగా విరాళమిస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన 33 మంది దళిత కుటుంబాలకు 99 ఎకరాల భూమి దళితబంధు పథకం కింద ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే తమ బతుకులు బాగుపడ్డాయని, కూలీలుగా ఉన్న తమని రైతుగా మార్చిన కేసీఆర్‎కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన భూమిలో పండిన సోయా పంట నుంచి ఒక్కొక్కరు 50 కిలోల చొప్పున 16.50 క్వింటాల్ సోయా పంటను అమ్మగా వచ్చిన మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా అందించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‎ గాడ్గె మినాక్షికి అందజేశారు. ఆసరా పెన్షన్‎తొ తమను పెద్ద కొడుకులా ప్రతి నెల ఆదుకుంటున్నాడని వృద్ధులు అన్నారు. అందుకే తమ పెన్షన్ నుంచి రూ.1000 చొప్పున అందరం కలిసి రూ. 50 వేలు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటిసీ గాడ్గె సుభాష్, తిరుపతి, సంజీవ్, దళిత కుటుంబాలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *