mt_logo

భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!

కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం వల్ల రైతులు, భూ యజమానులు తమ భూములు అమ్మాలంటే భయపడేలా తయారైంది. ఇంతకుముందు కేవలం ఆన్లైన్‌లో స్లాట్ బుక్ చేసుకొని, ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయ్యేది.

సులభతరంగా ఉన్న ఈ పక్రియను కాదని రేవంత్ సర్కార్ ఇప్పుడొక క్లిష్టమైన పద్ధతిని తీసుకొచ్చింది. ఇప్పుడు మీ భూమి ఎవరికైనా అమ్మాలంటే ఖచ్చితంగా సర్వేయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. డిజిటల్ సర్వే చేయించాల్సిందే.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 250 మంది ప్రభుత్వ సర్వేయర్లు మాత్రమే అన్నారు.. ఇప్పటికే వారికి పనిభారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు భూ భారతి వల్ల డిజిటల్ సర్వే తప్పనిసరి చేస్తే వారికి డిమాండ్ పెరుగుతుంది.. ఇక రైతులు సర్వేయర్లు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, ఎంతో కొంత ముట్టచెప్పాల్సి వస్తుంది.

సర్వేయర్లు కొరత ఉన్న నేపథ్యంలో.. వీఆర్వో, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికి వారు సుముఖంగా లేనట్టు సమాచారం. భూమికి సంబంధించిన అంశం కాబట్టి రైతుల ప్రైవేట్ సర్వేయర్లను నమ్మే పరిస్థితి లేదు. పైపెచ్చు.. భూమిని సర్వే చేసిన తర్వాత కొలతల్లో ఏదన్నా తేడా వస్తే.. ఎవరు పరిష్కరిస్తారు, ఎవరి దగ్గరకి వెళ్ళాలి అనే అంశంపై స్పష్టత లేదు.

ఇక ఎవరైనా రైతు ఏదైనా అత్యవసరమయ్యి కొంత భూమిని అమ్ముకుందాం అంటే సర్వేయర్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిందే. లేదు త్వరగా అవ్వాలంటే సర్వే ఫీజుకు అదనంగా.. మన అవసరం బట్టి ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే.

సులువుగా భూ విక్రయం, రిజిస్ట్రేషన్ జరిగే ప్రస్తుత పద్ధతిని కాదని కొత్త పద్ధతి తీసుకురావడం వెనుక తిర’కాసు’ ఏమిటో.. దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో వేచి చూడాల్సిందే.