mt_logo

పీవీని ఒకలా.. మన్మోహన్‌ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

తమ పార్టీ తరఫున భారతదేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవంలో ద్వంద్వ వైఖరి మరొక్కసారి తేటతెల్లమైంది.

పదేళ్లపాటు దేశానికి సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రాజ్‌ఘాట్‌లో నిర్వహించాలని.. అక్కడ ప్రత్యేక స్మారకస్థలిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ.. సరిగ్గా 20 ఏళ్ల క్రితం మరణించిన మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది.

పీవీ భౌతికకాయాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా గేట్లు మూసేసి.. హైదరాబాద్‌కు పంపి అంత్యక్రియలు చేయించింది. పీవీ కుటుంబసభ్యులకు ఇష్టం లేకున్నా.. వాళ్ళను ఒత్తిడి పెట్టి మరి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన పీవీని అవమానించింది.

హైదరాబాద్‌లో ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని నమ్మబలికి.. కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా, అంత్యక్రియలు జరిగాక పీవీ నరసింహా రావు భౌతికకాయం సరిగ్గా కాలిందా లేదా అని కూడా పట్టించుకోలేదు. పీవీ చితి వద్ద సగం కాలిన శరీరాన్ని కొన్ని జంతువులు పీక్కుతిన్నాయి అని అప్పట్లో టీవీ ఛానెళ్లలో వార్తలు కూడా వచ్చాయి అంటే పీవీని కాంగ్రెస్ ఎంత ఘోరంగా అవమానించిందో చెప్పొచ్చు.

నిజానికి పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు. ఇద్దరు కలిసి తమ సంస్కరణలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెకించారు. అలాంటిది ఆపత్కాలంలో భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించిన పీవీని కాంగ్రెస్ విస్మరించిన తీరు ఇప్పటికి ప్రజల స్మృతిలో ఉంది.

వాస్తవానికి.. ఎంతో పేరుగాంచిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లో తీసుకొచ్చిందే పీవీ. పీవీకి మన్మోహన్ సింగ్‌కు మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికి.. పీవీ మరణించినప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియా గాంధీ మాటకు అప్పటి ప్రధాని మన్మోహన్ ఎదురు చెప్పలేకపోయారు.

సీనియర్ నాయకుల పార్థివదేహాలను పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం ఉంచే కాంగ్రెస్ పార్టీ.. పీవీ విషయంలో ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరించిందో సోనియా గాంధీకే తెలియాలి.

కొసమెరుపు ఏంటంటే.. రాజ్‌ఘాట్‌లో ఒక్కొక్కరికీ ప్రత్యేక స్మారక స్థలం ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు కాబట్టి.. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని 2013లో మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలకు రాజ్‌ఘాట్‌లో ప్రత్యేక స్మారక స్థలం కావాలని కాంగ్రెస్‌ పార్టీ స్వయంగా కోరడం గమనార్హం.

పైగా.. మన్మోహన్‌కు ప్రత్యేకంగా స్మారకస్థలిని నిర్మించకపోవడమంటే దేశ తొలి సిక్కు ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు. మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు జరిగిన అన్యాయం, అవమానం గురించి ఒక్క కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడకపోవడం శోచనీయం