తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం నుంచి ఇవ్వాళ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం దాకా ఒక ఉద్వేగ సందర్భంగా స్వీకరించవలసి ఉన్నది. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ ఊహించనివీ, అంతకుముందరి సంఘటనలు, సందర్భాలతో పోల్చుకోదగినవి. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం అయినా, అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన మన తెలంగాణ ఉద్యమకారుడు అయినా ఇవన్నీ తెలంగాణవాదులు ఆస్వాదించవలసిన క్షణాలు. అందుకే సీఎం కేసీఆర్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా మాట్లాడినప్పుడు ఉద్వేగానికి స్వయంగా లోనయ్యారు. ఈ సభలో తెలంగాణ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎలాంటి భావాలు కదలాడాయో ఆయన చెప్పారు. అదే సమయంలో ఏ సభలోనైతే తెలంగాణ పదాన్ని నిషేధించారో, ఆ సభాపీఠం మీద తెలంగాణ ఉద్యమకారుడు అధిష్ఠించడం ఒక అస్థిత్వ విజయంగా కేసీఆర్ అభివర్ణించారు. సభ మొత్తం అదే మూడ్‌తో కొనసాగింది.
మామూలుగానైతే రాష్ట్రపతి ప్రసంగం కానీ, ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం కానీ లాంఛనంగా, సాంప్రదాయబద్ధంగా సాగుతుంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో? ఆ ప్రభుత్వం విధానాలను, లక్ష్యాలను, వచ్చే అయిదేళ్ల నడకను, ప్రాథమ్యాలను గవర్నర్ ప్రభుత్వం తరఫున ప్రకటించడం సర్వసాధారణం. కానీ తొట్టతొలి తెలంగాణ శాసనసభలో ఇవ్వాళ గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం ప్రారంభం కావడమే తెలంగాణ రాష్ట్ర ఉభయ సభల తొలి చారిత్రక సమావేశంలో ప్రసంగించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్న మాటతో మొదలయింది. ఇదొక చిరస్మరణీయ సందర్భం అని ఆయన గుర్తు చేశారు. అంటే ఒక చారిత్రక సందర్భాన్నీ, చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిన అవసరాన్నీ గవర్నర్ గుర్తుచేశారు. సభలో ఉన్న పార్టీలయినా, తెలంగాణవాదంతో ముడివడి ఉన్న ఎవరైనా ఈ ప్రత్యేకతను గుర్తించాల్సి ఉన్నది. దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ స్వీయ అస్థిత్వ విజయాన్ని ఆస్వాదించవలసి ఉన్నది. గతంలో ఇవ్వాళ్టి సందర్భాన్ని పోల్చుకోవలసి కూడా ఉన్నది.
ఇదే సభలో ఇదే గవర్నర్ నరసింహన్ ప్రసంగం గతంలో ఎంత గందరగోళంలో సాగిందీ, అప్పటి ఉద్రిక్తతలు, మొత్తం వ్యవస్థలన్నీ, సీమాంధ్ర పెత్తందారుల తాబేదారులుగా ప్రవర్తించి, ఎట్లా తెలంగాణ శాసనసభ్యులను ఒంటరులను చేసిందీ గుర్తుచేసుకోవలసి ఉన్నది. అదే గవర్నర్ అదే సభలో మాట్లాడిన మాటలను ఒక చరిత్రగానే చూడవలసి ఉన్నది. ఇదొక్కటే కాదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వందలాది యువత బలిదానాలను నా ప్రభుత్వం మరిచిపోదు అని గవర్నర్ అన్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు ఎవరూ విలువ కట్టలేరు అని కూడా ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో బలిదానాలనూ శంకించారు. అప్పుడు తెలంగాణ వాదుల బాధ వర్ణనకు అందనిది. కానీ తెలంగాణ రావడమే ఒక చరిత్ర. అదీ మార్పు. అదీ మన రాష్ట్రంలో మనం ఆలోచించే ధోరణి. దాన్ని తెలంగాణ ప్రజలు, సభలోపల ఉన్న అన్ని పార్టీల తెలంగాణ సభ్యులూ గమనించవలసి ఉన్నది. ఇది కొత్త చరిత్ర.
సరే! ప్రభుత్వాల ప్రాథమ్యాలను గవర్నర్ ఏకరువు పెట్టడం పరిపాటి. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇది వరకే మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని అంశాలనూ గవర్నర్ సభలో ప్రకటించడం ద్వారా ప్రభుత్వం రాబోయే అయిదేళ్ల కాలంలో ఏమి చేయబోతున్నదో? ఒక స్పష్ఠత వచ్చింది. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన, సంక్షేమాన్ని అతి ముఖ్యమైన అంశంగా భావించడం, బడుగు బలహీనవర్గాలకు రానున్న ఐదేళ్ల కాలంలో లక్ష కోట్లు సంక్షేమ ప్రణాళికలు, పింఛను పెంపు, కేసీఆర్ ఎన్నికల సమయంలో విస్తృతంగా జనరంజకంగా ప్రచారం చేసిన ఆయన కలల నమూనా రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణం, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, వ్యవసాయం, నీటిపారుదల ప్రాధాన్యాలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి, ఐటీఐఆర్ ప్రాజెక్టు.
జవాబుదారీగా ఉండడానికి పౌర సమాజ ప్రతినిధులతో కూడిన రాష్ట్ర సలహామండలి లాంటివి గవర్నర్ ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రకటించారు. అందుకే ప్రతిపక్షాలు అలవాటుగా ఏమున్నది గవర్నర్ ప్రసంగంలో అన్నాయి. కానీ ప్రతిపక్షాలయినా, అధికార పక్షమైనా ఈ చారిత్రక ప్రతి సందర్భాన్నీ ఒక అస్థిత్వ విజయంగా భావించి ఆస్వాదించడం మాత్రం మరిచిపోవద్దు. ఎందుకంటే కొత్త చరిత్ర ప్రారంభమయింది. అందులో తెలంగాణ సమాజం భాగమౌతున్నది. ప్రతి క్షణమూ అపూర్వ క్షణమే. భవిష్యత్తు చాలా ఉంది. మాట్లాడుకోవడానికి, తగాదా పడడానికీ విమర్శలు చేయడానికీ ప్రతిపక్షాలకు కావలసినంత సమయం ఉన్నది. కానీ సమస్త తెలంగాణ ప్రజలు ఇప్పటి ఈ క్షణాలను ఆస్వాదించాలి. ఇప్పటి సంబురం ఇదే.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..