mt_logo

రైతులకు కష్టం వస్తే ముందుండేది కేసీఆర్ మాత్రమే : మంత్రి వేముల ప్రశాంత్

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్నే తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులను కోరారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, అది కూడా తన సొంత గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకున్నా ఇక్కడ రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసారని అన్నారు. అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని కేవలం 1200 రూపాయలకు, 1300 రూపాయలకు షావుకార్లకు అమ్ముకుంటుంటే.. మన సీఎం మాత్రం కేంద్రంతో మాట్లాడి వరికి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 1960/-రూ సాధారణ రకానికి 1940/- రూ.లు ఇచ్చే విధంగా రైతులకు అండగా ఉన్నారని అన్నారు. దార్శనికతతో రైతుల పక్షాన నిలబడి రైతుల మీద ప్రేమ ఉంటే ఎట్లా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఎఫ్ఏక్యూ కలిగిన నాణ్యమైన ధాన్యాన్ని, నిబంధనలకు లోబడి తేమ కలిగిన ధాన్యాన్ని తీసుకువస్తే కిలో కూడా తరుగు తీయకుండా చూసే బాధ్యత నాది అని, ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని మంత్రి వేముల ప్రశాంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నరెడ్డి, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *