mt_logo

దేశ అభివృద్ధిలో శాంతి భద్రతలే ప్రధాన పాత్ర పోషిస్తాయి : హోం శాఖ మంత్రి మహ్మద్ మహూమూద్ అలీ

హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21 నాటి భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన 377 మంది పోలీసులకు అంజలి ఘటించారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ కరోనా మహమ్మారితో అసువులు బాసిన తెలంగాణకు చెందిన 72 మంది పోలీసులకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ దేశంలో అయినా శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, శాంతి భద్రతలు లేని చోట ప్రజల్లో అభద్రతాభావం, పేదరికం పెరుగుతుందని.. అందుకే పోలీసు బలగాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యకలాపాలు, సంఘవిద్రోహక శక్తులను పెరగనివ్వకుండా పోలీస్ యంత్రాంగం పగలూరాత్రులు కష్టపడుతున్నారని కితాబిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సి.సి.టీ.ఎన్.ఎస్ అనే జాతీయ ఈ-గవర్నెస్ మెషిన్ మోడ్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాల మధ్య సమన్వయం కుదర్చవచ్చని.. అలాగే ఈ విధానం వల్ల 10 సంవత్సరాల డేటాను క్రోడీకరించి అంతరాష్ట్ర నేరగాళ్ళను పట్టుకోవచ్చని తెలియజేసారు. మహిళల్లో భరోసా కల్పించేందుకు హైదరాబాద్ లో ‘భరోసా’ సెంటర్ ఏర్పాటు చేశామని.. మహిళలను బాధలను, మానసిక ఒత్తిడి నుండి బయటపడేసి వారిని సాధారణ స్థితికి తీసుకురావడమే ‘భరోసా’ ఉద్దేశమని అన్నారు. బాధిత మహిళలకు చట్టపరమైన సలహాలు, వైద్యసహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ వంటివి ఇప్పిస్తూ దేశంలోనే తెలంగాణ ‘భరోసా’ సెంటర్ ప్రథమ స్థాయిలో నిలిచిందన్నారు. ఇలాంటి కేంద్రాలను ఇక జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు హోం మంత్రి ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో ఎలాంటి మత పరమైన ఉద్రిక్తతలు లేకుండా నగరాన్ని కాపాడిందని తెలిపారు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి సమయంలో, అలాగే ఇటీవల ముగిసిన బోనాలు, వినాయక నిమజ్జనం, బతుకమ్మ పండుగల సందర్భంగా రాష్ట్ర పోలీసుల పనితీరు భేష్ అని మహమూద్ అలీ ప్రశంసించారు. సమాజం నుండి పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందాలంటే పోలీసులు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా.. ప్రభుత్వ గౌరవ మర్యాదలు, ప్రతిష్ట పెంచే విధంగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసుల విధి నిర్వహణ ఇంకా పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం అయిన ‘Police Flag Day” ఇచ్చే స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణకు పునరంకితం కావాలని, అరాచక శక్తులను అణచి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కొత్త ఉత్సాహంతో నడుంకట్టాలని ఈ సందర్భంగా హోం మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *