mt_logo

వికటించిన బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భగ్నం  

తెలంగాణ అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలను కొనుగోలు చేయాలనే బీజేపీ కుట్ర భగ్నం చేశారు పోలీసులు. బీజేపీ  కీలక నేతల  అనుయాయుల ద్వారా డబ్బు సంచులతో ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. టీఆర్ఎస్ ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారం మేరకు తాము ఫాంహౌజ్‌ను ముట్టడించి బేరసారాలకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. ఈ కుట్రలో ఒక్కో ఎంఎల్‌ఎకి రూ.100 కోట్లు ఆఫర్ పెట్టిందని తెలుస్తోంది. ఈ బేరసారాల తతంగాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సన్నిహితుడు నందు(డెక్కన్ ఫ్రైడ్ హోటల్ ఓనర్) ఆధ్వర్యంలో నిర్వహించారని పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగింది : 

అధికార పార్టీకి చెందిన పలువురు నేతల కొనుగోలే లక్ష్యంగా డబ్బు కట్టలతో ఫరీదాబాద్‌కు చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లు సహా పలువురు హైదరాబాద్‌ శివార్లలోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, పినపాక ఎంఎల్‌ఎ రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డితోపాటు పైలట్ రోహిత్ రెడ్డిని డబ్బుతో ఎరవేసే ప్రయత్నం చేశారు. అయితే అధికార పార్టీ ఎంఎల్‌ఎలు ధనానికి, ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వెనువెంటనే తెలంగాణ పోలీసు ఆపరేషన్ చేపట్టి బిజెపి కుట్రను భగ్నం చేసింది. 

ఎంఎల్‌ఎలు ఇచ్చిన సమాచారంతోనే : 

దీనిపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీం ద్ర మీడియాతో మాట్లాడుతూ… తమను ప్రలోభ పెడుతున్నారని ఎంఎల్‌ల నుండి సమాచారం ఇచ్చారని తెలిపారు. నందకుమార్, సింహయాజులు రామచంద్రభారతిని నకిలీ పేరుతో హైదరాబాద్‌కు తీసుకొచ్చారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే పదవులు ఇస్తామని రామచంద్రభారతి ప్రలోభ పెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని కమిషనర్ తెలియజేసారు. రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌లను అదుపులోకి తీసుకున్నామని, లీగల్‌గా చర్యలు తీసుకుంటామని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆ నలుగురు ఎంఎల్‌ఎలని ఏ రకమైన ప్రలోభాలకు గురిచేశారు.. ఇత్యాది అంశాలపై లోతుగా దర్యాపు చేస్తామని సిపి వెల్లడించారు.

బిజెపి ఎంతో కాలంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపినాట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరో ఏక్‌నాథ్ షిండే వస్తాడంటూ బిజెపి అగ్రనేతలు పలు సందర్భాల్లో మీడియాకు కూడా వెల్లడించారు. అదేస్థాయిలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ సైతం బిజెపి ‘షిండే’లపై విరుచుకుపడిన సందర్భాలు లేకపోలేదు. కాగా దేశ వ్యాప్తంగా అవకాశం ఉన్న చోటల్లా బిజెపి ఇలాంటి బేరసారాలకు తెగబడుతూ ఆయా ప్రభుత్వాలను అస్థిరపర్చి తద్వారా ఆయా రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ విదితమే. దక్షిణాదిన అందునా తెలంగాణలో విజయబావుటా ఎగురవేస్తే ఇక తమకు తిరుగుండదని భావించిన బిజెపి పెద్దలు తమదైన శైలిలో పావులు కదుపుతూ వచ్చారు. 

ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు బిజెపి పెద్దలే వ్యూహరచన చేశారని పలు సందర్భాల్లో అధికార టిఆర్‌ఎస్‌తో పాటు ఇతర విపక్షాలు సైతం బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించాయి. ఓ వైపు టిఆర్‌ఎస్ పెద్దలను జైలులో పెడతాం.. ఇడి, సిబిఐ దాడులు నిర్వహిస్తామని పేర్కొంటూనే మరో వైపు చాప కింద నీరులా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. అధికార టిఆర్‌ఎస్ మాత్రం ఎప్పటికప్పుడు బిజెపి కుట్రలను తిప్పికొడుతూ వచ్చింది. ఇదే క్రమంలో తాజాగా అధికార పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డిలను తన అనుయాయుల ద్వారా బిజెపిలోకి రప్పించేందుకు కుట్రకు ఢిల్లీ బిజెపి పెద్దలు పక్కా ప్రణాళిక వేయగా… అది కాస్త బెడిసికొట్టింది. ఉద్యమ పార్టీకి చెందిన తమ నేతలు ఎవరైనా ఇతర పార్టీలోకి వెళ్లబోరని మరోసారి ఆ నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు రుజువు చేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చి తద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న బిజెపి తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు నిలువునా బొక్కా బోర్లా పడ్డట్టయింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *