mt_logo

 స్వరాష్ట్రం ఏర్పడ్డాకే గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు : మంత్రి కేటీఆర్

కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు మన్నెగూడలో నిర్వహించిన యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు వచ్చాయని… ఏటా రూ.11 వేల కోట్లతో రెండు విడతలుగా యాదవ కుర్మలకు గొర్రెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ రాకముందు రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో మెంబర్లుగా ఉండేవారు. ఈ రోజు ఆ సంఖ్య ఏడు లక్షల 61 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోసే ఉద్దేశంతో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఆలోచనతో కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురుమలను భాగస్వాములను చేసేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే’అన్నారు.

‘తెలంగాణ పథకాలు నెంబర్ వన్‎గా ఉన్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల, గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. బయటి వాళ్లు వచ్చి చెప్తే తప్ప.. మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదు. గొల్ల కురుమ సోదరుల కోసం తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నది వాస్తవం. పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదు, తాతలనాటి కులవృత్తులు కూడా బాగుంటేనే దేశం బాగుంటుందనేది కేసీఆర్ ఆలోచన. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరపాలన్న గొల్ల కురుమల డిమాండ్‎ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా సదర్ పండుగను కూడా అధికారికంగా జరిపే డిమాండ్‎ను కూడా పరిశీలిస్తున్నాం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ధర్మం వైపు నిలబడేవారు గొల్ల, కుర్మలు : మంత్రి హరీష్ రావు 

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ధర్మం వైపు నిలబడే వారు గొల్ల, కురమలని పేర్కొన్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ గొల్ల కురమలను అభివృద్ధి చేశారని, వారిని ఆర్థికంగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. గొల్ల కురమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారన్నారు. కర్ణాటకలో అప్పటి మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రేవణ్ణ గొర్రెల స్కీమ్‌ గురించి తెలిసుకుని సీఎం కేసీఆర్‌ను అభినందించారని, హైదరాబాద్‌కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. కురమలకు, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణమవుతున్నాయని, రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. గొల్ల కురమలు గొర్రెలు కొనుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులు వేయిస్తే.. ఆ డబ్బులు చేతికి రావని, సీజ్ అవుతయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయన్నారు. కానీ, వచ్చే నెల ఐదో తేదీ తర్వాత ఎప్పటిలాగే మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తామని హరీష్ రావు తెలియజేశారు.

యాదవుల గురించి ఆలోచించింది ఒక్క కేసీఆర్ మాత్రమే : మంత్రి తలసాని 

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… దేశ చరిత్రలో యాదవుల గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. గొల్ల కుర్మలను గౌరవించి అడగకుండానే గొర్ల పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొందరు దుర్మార్గుల కారణంగా నగదు బదిలీ ఆగిపోయిందని మునుగోడు ఎన్నిక పూర్తైనంక దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మన కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *