రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండండి- కేటీఆర్

  • April 9, 2019 8:19 pm

లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇన్నిరోజులూ అవిశ్రాంతంగా కష్టపడ్డ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. సోమవారం శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఐదువేల మందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు ఓటుహక్కు వినియోగించుకునేలా, పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని, ఓటింగ్ ఎంత పెరిగితే టీఆర్ఎస్ కు మెజార్టీ అంత పెరుగుతుందని చెప్పారు.

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో అందరూ ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా చేయాలని, ఓటరు జాబితాలో పేరుండి, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ముందుగానే గుర్తించి ఓటేసేందుకు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లను నియమించాలని, అవసరమైన అనుమతి పత్రాలు, ధ్రువపత్రాలు సమర్పించాలని నాయకులకు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి అన్ని విధాలుగా సహకరించాలని కేటీఆర్ సూచించారు. రాబోయే రెండు రోజుల్లో ప్రత్యర్ధి పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE