ఇక రాష్ట్రానికి కూరగాయల కొరత తీరనుంది. రాష్ట్ర అవసరాలకు సరిపడా 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా ఈ యాసంగి నుండే వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలతోపాటు కూరగాయలు, ఆకుకూర పంటల సాగును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలు ఏటా 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు వినియోగిస్తుండగా… అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో కూరగాయలసాగు గతంలో మూడున్నర నుంచి నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో, కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కూరగాయలు ఉత్పత్తి జరిగేది. అయితే వివిధ కారణాలరిత్యా ఈ పంటల సాగు విస్తీర్ణం గత ఏడాది 1.5లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ విస్తీర్ణం మరింతగా తగ్గి 63వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో రాష్ట్ర అవసరాలకు సరిపడినంత కూరగాయలు, ఆకు కూరల కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధార పడక తప్పటం లేదు. మహారాష్ట్ర , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి రావడం, చమురు ధరలు పెరగడంతో అక్కడ పండించిన కూరగాయలు రాష్ట్రానికి చేరుకునే సరికి రవాణ ఖర్చులు అధికమయ్యి.. అంతిమంగా వినియోగదారుల చేతికి వచ్చేసరికి కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. మరోవైపు వరి సాగువల్ల మార్కెట్‌లో ధాన్యం విక్రయాల సమస్యలు తలెత్తుతుండటంతో, వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగును ప్రోత్సహించడం వల్ల రెండు విధాల లాభం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతేకాకుండా కూరగాయల ఉత్పత్తికి ఏడాది పొడవునా అవకాశాలు ఉండటంలో రైతులకు ఈ పంటల సాగు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు :
రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాష్ట్రంలోని పట్టణ సముదాయాలు, మున్సిపల్ కార్పోరేషన్లు , అధిక జనాభా కలిగిన పారిశ్రామిక వాడల చుట్టూ హైబ్రిడ్ కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తోంది. కూరగాయల ఉత్పాదకతను మెరుగు పరచడం, రైతులకు గరిష్టంగా రాబడి లభించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఏడాది పొడవునా వినియోగదారులకు కూరగాయలు , ఆకు కూరల లభ్యత ఉండేలా సమన్వయం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు కూరగాయల పంటసాగులో పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పిస్తోంది. సన్న చిన్న కారు రైతులకు రాయితీలపై డ్రిప్ సదుపాయం కలుగజేస్తోంది. కూరగాయలు , ఆకు కూరాల సాగు కోసం రాష్ట్ర ఉద్యాన శాఖ రెండు హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద మేడ్చెల్ జిల్లాలోని జీడిమెట్లలో, సిద్దిపేట జిల్లాలోని ములుగులో వీటిని ఏర్పాటు చేసింది. ఈ హెటెక్ నర్సరీ యూనిట్లలో టామాటా, వంకాయ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిప్లవర్ తదితర రకాలకు చెందిన పంటల అధిక నాణ్యత కలిగిన నారు పెంచుతున్నారు. 90శాతం రాయితీపై ఈ నారు అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కూరగాయల విత్తన సహాయ పథకం కింద బెండతోపాటు తీగజాతికి చెందిన కూరగాయలు, బీన్స్, ఆకు కూరలకు సంబంధించిన విత్తనాల కొనుగోలుకు అయ్యే వ్యయంలో 50శాతం రాయితీని అందిస్తున్నట్టు తెలిపారు. పంట కోతల అనంతరం నష్టాలను తగ్గించడానికి కూరగాయల నిర్వహణ, రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్లాస్టిక్ బుట్టల వినియోగానికి 50శాతం రాయితీతో బుట్టల సరఫరాకు నిధులు కేటాయించారు.