mt_logo

స్పీడందుకున్న విభజన ప్రక్రియ..

రాష్ట్ర విభజన ప్రక్రియ రోజురోజుకీ వేగవంతం అవుతోంది. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రధాన శాఖల విభజన పూర్తిచేసేలా అధికారులు ముందుకు పోతున్నారు. ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహన్ విభజన ప్రక్రియను గమనిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావడంతో రెండు రాష్ట్రాల పరిపాలనకు అవసరమైన అసెంబ్లీ, సచివాలయం, మండలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కార్యాలయాల ఎంపికకు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ లక్ష్మీ పార్థసారథి భాస్కర్ ను చైర్ పర్సన్ గా ఒక కమిటీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి నియమించారు. మొదటగా ఆర్ధిక రంగ వ్యవహారాలను చక్కబెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే జూన్ రెండు తర్వాత తెలంగాణకు వచ్చే ఆదాయం అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోనే జమచేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఆదాయాన్ని జమ చేసేందుకు ప్రత్యేకంగా పద్దులను రెడీ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లలో నిర్వహించగా, జూన్ రెండు నుండీ తెలంగాణకు ఎస్‌బీహెచ్, ఆంధ్రప్రదేశ్ కు ఎస్‌బీఐను కేటాయించనున్నారు. పరిశ్రమల శాఖలో కూడా విభజన ప్రక్రియ జోరుగానే సాగుతుంది. పనులన్నీ ఏప్రిల్ 15 నాటికల్లా పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మంగళవారం నాటికి పరిశ్రమల శాఖ పరిధిలోని అన్ని విభాగాలు, కార్పొరేషన్లు, స్థిర, చరాస్తుల జాబితా సిద్ధం చేయాలని కమిటీ పేర్కొంది. మైనింగ్ శాఖలో వేలకొద్దీ కేసులు పెండింగ్ లో ఉన్నందున జాబితా సిద్ధం చేయడానికి మరికొంత సమయం కావాలని, మే 15 నాటికల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని షుగర్, చేనేత, జౌళి, ఆప్కో, ఖాదీ గ్రామోద్యోగ్, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ శాఖల అధికారులు కమిటీని కోరారు. విద్యుత్ విభజనపై భారీ కసరత్తు ప్రారంభమయ్యింది. విద్యుత్ రంగ విభజన, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా తదితర అంశాలపై గవర్నర్ రాజ్ భవన్లో ఒక సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు విద్యుత్ విభజనపై నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలు విభజన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రెండు రాష్ట్రాలకూ అవసరమైన శాసనసభ, మండలి, సచివాలయం, ఇతర కార్యాలయాల ఎంపిక ప్రక్రియకోసం ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు కూడా మే నెలతో ముగియనుండటంతో ఉమ్మడి రాష్ట్రంలో నియమించబడ్డ ఉద్యోగులకు జీతభత్యాలు ఏ రాష్ట్రం భరించాలన్నదే పెద్ద సమస్యగా మారింది. మే నెల వేతనాన్ని చెల్లించి జూన్ తర్వాత ఏర్పడే కొత్త రాష్ట్రాలు అవసరాన్నిబట్టి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని చేపడతారని తెలిసింది. ఏది ఏమైనా ఆఖరినిమిషంలో హైరానా పడకుండా విభజన ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని గవర్నర్ అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *