mt_logo

మన రాష్ట్రం, మన పార్టీ, మన పాలన- కేటీఆర్

మన తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీని గెలిపించి మంచి పాలన అందించడానికి తెలంగాణ ప్రజలంతా సహకరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఒకసారి అవకాశం ఇవ్వమని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రా పార్టీలైన టీడీపీ, వైసీపీలను తరిమికొట్టాలని, కాంగ్రెస్ పాలన మంచిగా లేనందునే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, వేయిమందికి పైగా బలిదానాలు చేసుకున్నాక మేమే తెలంగాణ ఇచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుపడేలా ఉందని కాంగ్రెస్ నేతలపై నిప్పులుచెరిగారు. పదవుల కోసం ఏనాడూ గట్టిగా మాట్లాడని నేతలు తెలంగాణ కోసం పాటుపడ్డామని అనడం హాస్యాస్పదమని చెప్పారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే నియోజకవర్గాల అభివృద్ధికై కృషి చేశామని, కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ దే అధికారమని అన్ని సర్వేలు చెప్తున్నాయని వివరించారు. ఢిల్లీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఢిల్లీ మెడలు వంచే సత్తా ఒక్క కేసీఆర్ కే ఉందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *