mt_logo

ఆరు గ్యారెంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు: కేటీఆర్

బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు అని అన్నారు.

కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు.

ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతులెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారు అని కేటీఆర్ విమర్శించారు.

అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలి. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలి. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదు, అరెస్టులు అంత కన్నా కాదు.. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరు అని అన్నారు.