mt_logo

భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్

భారతీయ సినిమా దర్శక దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ భూషణ్ శ్యామ్ బెనగల్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినిమా రంగంలో సమాంతర స్థానం కల్పించి, సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని, భరత మాత కన్న తెలంగాణ ముద్దు బిడ్డ శ్యామ్ బెనగల్ (బెనగల్ల శ్యామ్ సుందర్ రావు) అని కొనియాడారు.

ఇటు తెలంగాణ జీవన నేపథ్యాన్ని, అటు దేశీయ సామాజిక సంస్కృతిక వైవిధ్యాన్ని ఇరుసుగా చేసుకుని, ఆలోచింప చేసేవిధంగా దృశ్యమానం చేస్తూ, డాక్యుమెంటరీలు, సినిమాల రూపంలో వారందించిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు.

హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చలనచిత్ర రంగంలో తన కృషితో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించి, భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన శ్యామ్ బెనెగల్ తెలంగాణకు గర్వకారణం అని అన్నారు.