mt_logo

సిరిసిల్లా అప్పారెల్ పార్కులో టెక్స్‌పోర్ట్‌ భారీ పెట్టుబడులు

సిరిసిల్లా అప్పారెల్ పార్కులో ప్రముఖ టెక్స్‌పోర్ట్‌ గ్రూప్‌ సంస్థ భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఈ కంపెనీ 60 కోట్లతో తమ ఫ్యాక్టరీని సిరిసిల్లా జిల్లాలోని పెద్దూరు వద్ద ఏర్పాటు చేయనుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, చేనేత జౌళి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్‌పోర్ట్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… సిరిసిల్లలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన టెక్స్‌పోర్ట్‌ కంపెనీని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపునకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. టెక్స్‌పోర్ట్‌ కంపెనీ సాధ్యమైనంత త్వరగా పరిశ్రమ ప్రారంభించేందుకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. టెక్స్‌పోర్ట్‌ సంస్థ ఎండీ గోయెంకా మాట్లాడుతూ… సిరిసిల్లలో నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించినట్టు, ఈ పరిశ్రమ ద్వారా రెండు వేలమంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌, టెక్స్‌పోర్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 63 ఎకరాల్లో రూ.175 కోట్లతో అప్పారెల్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తున్నారు. అప్పారెల్స్‌ ఉత్పత్తులతోపాటు ఎగుమతులకు అనుగుణంగా ‘బిల్ట్‌ టు సూట్‌’ పద్ధతిన దేశంలోనే తొలిసారి ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఇపుడు టెక్స్‌పోర్ట్‌ సంస్థ ఈ పార్కులోనే 7.42 ఎకరాల విస్తీర్ణంలో 60 కోట్ల పెట్టుబడితో తన ఫ్యాక్టరీని ఏర్పాటుచేయనున్నది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీకి 19 ఫ్యాక్టరీలు ఉండగా, టెక్స్‌పోర్ట్‌ కంపెనీ 1978 నుంచి అప్పారెల్స్‌ తయారీ రంగంలో ఉన్నది. అంతేకాకుండా ఎగుమతులే ప్రధానంగా రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారంలో కంపెనీకి సుదీర్ఘ అనుభవం ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *