19వ బయో ఆసియా-2022 సదస్సులో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫైర్ సైడ్ ఛాట్ ప్యానల్ చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కరోనాను కట్టడి చేసే రెండు వ్యాక్సిన్లు హైదరాబాదులో తయారు అయ్యాయన్నారు. హైదరాబాద్, తెలంగాణ ప్రపంచ ఫార్మ్ హబ్ గా మారిందన్నారు. మెడిసిన్స్ తయారు చేయడం అన్నది నిరంతర ప్రక్రియ అని, ఛాలెంజ్ తో కూడుకున్న పని అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో మీరు(బిల్) వచ్చిన హైదరాబాద్ వేరు.. ఇప్పుడున్న హైదరాబాద్ వేరని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరంలో ఎన్నో మార్పులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కరోనా వంటివి మరిన్ని వచ్చే అవకాశం ఉంది : బిల్ గేట్స్
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఇండియా వేగంగా స్పందించిందని బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ ను వేగంగా తయారు చేశారని ప్రశసించారు. నిమోనియా, టైఫాయిడ్ వ్యాధులపై ఇప్పటికీ పరిశోధన కొనసాగుతూనే ఉందన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి వైరసులు మరిన్ని దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఫార్మా టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నదని గేట్స్ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ ధరలు భారత్ లో అందరికీ అందుబాటులో ఉందన్న ఆయన.. ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీని వాడుకుని వేగంగా మెడిసిన్స్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాత్రికి రాత్రి ఏది మనం తయారు చేయలేమని, ఏది తయారు చేయాలన్న కొంత సమయం పడుతుందన్నారు. భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా నిర్వహించారని ప్రశసించారు.