స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డుల్లో మరోసారి తెలంగాణ సత్తా చాటింది. దేశంలో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలు కైవసం చేసుకున్నాయి. 2022, డిసెంబర్ నెలకు గాను కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ – 2023 అవార్డులలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రథమ స్థానం, కరీంనగర్ కు ద్వితీయ స్థానం, పెద్దపల్లి జిల్లాకు తృతీయ స్థానం లభించింది. ఆయా జిల్లాలకు 4 రేటింగ్ కల్పించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ట్విట్టర్లో పోస్టు చేసింది. అవార్డులు సొంతం చేసుకున్న జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో తడి-పొడి చెత్త, వర్మీ కంపోస్టు షెడ్లు, మురుగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇళ్లలో మరుగుదొడ్లు వాడటం వంటి అంశాలను లెక్కలోకి తీసుకొని 4 రేటింగ్స్ ర్యాంకింగ్ ప్రకటించింది కేంద్రం.
కాగా దేశంలోనే తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్న ఘనతను సాధించిన నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గొప్పతనాన్ని దేశం నలుమూలల చాటినందుకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, ఆయా జిల్లాల కలెక్టర్లను, అధికారులను, పంచాయితీ సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు.