mt_logo

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం… స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వం  

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు, వినతులు, లేఖల అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇందుకోసం విధివిధానాలను రూపొందించడానికి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో రక్షణశాఖ, మున్సిపల్ సెక్రెటరీతో సహా 8 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగుల బదిలీ, స్థిరచరాస్తుల ఎలా బదలాయించాలి వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.  

దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఏరియాలో ఆర్మీ ఆంక్షల వల్ల కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. కంటోన్మెంట్ ఏరియాలోకి రాకపోకలు నిలిపివేసిన ప్రతిసారి స్థానిక ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యేవి. ఈ విషయాన్ని వివరిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్… కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో కలపాలంటూ అనేకమార్లు కేంద్రానికి లేఖలు రాస్తూ విన్నవించారు. 

కాగా తీవ్ర నిధుల కొరత వలన కంటోన్మెంట్ బోర్డు మౌలిక వసతులు, రోడ్ల విస్తరణపై ఆర్మీ దృష్టి పెట్టలేదు. దేశంలోని అన్ని కంటోన్మెంట్ ఏరియాల పరిస్థితి ఇలాగే ఉండటం, అభివృద్ధికి తగిన బడ్జెట్ లేకపోవటం, స్థానిక ప్రజల నుండి వినతులు, విమర్శలు ఎదురవడంతో ఎట్టకేలకు ఆయా ఏరియాలను స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు తెలపాలంటూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాయగా… తెలంగాణ ప్రభుత్వం తమ సమ్మతిని కేంద్రానికి తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం అయితే 3000 ఎకరాల విలువైన భూమి బల్దియా పరమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *