mt_logo

కంటివెలుగుతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధిస్తాం : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండవ విడత పథకం జనవరి 18న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనుండగా… మంగళవారం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమంపై హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధికారులతో వీడియో సమావేశం జరిపి, కంటివెలుగుపై దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… మొదటి విడత కంటివెలుగులో అనుకున్న సమయంలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించామని, అదేవిధంగా రెండోవిడత కంటివెలుగు వంద రోజుల్లోనే పూర్తి చేసి గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకునేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అవసరమైన వారందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా ప్రజాప్రతినిధులందరూ దీనిలో భాగస్వామ్యం అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.  

సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి రూ.200 కోట్లు మంజూరు చేసారని అన్నారు. మొదటి విడత కంటివెలుగు 8 నెలల్లో పూర్తి చేయగా, రెండవ విడత వందరోజుల్లోనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించగా, ఇందుకోసం వైద్యబృందాలను, 827 నుండి 1500 కు పెంచామని, పీహెచ్‌సీల్లో కొత్తగా 929 మంది వైద్యులని నియమించామని వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో 10 క్వాలిటీ కంట్రోల్ బృందాలు, జిల్లాకు ఒక క్వాలిటీ కంట్రోల్ బృందం ఏర్పాటు చేసామని అన్నారు. ఈనెల 12 లోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటివెలుగు సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంటివెలుగు క్యాంపుల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. కాగా ఈ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి రావు, సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *