తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేయాలని కర్ణాటక రైతులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణాలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా తదితర పధకాలు తమకూ అమలు చేయాలని, సాగునీటి పథకాలు నిర్మించాలని, పంటలను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్లకార్డులు చేతపట్టి బెంగుళూరు నగరంలో మహాధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ధర్నాలో రైతుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక వ్యాప్తంగా వేలాదిమంది రైతులు పాల్గొన్నారు. వేలాది మంది రైతులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికై స్థానిక మెజిస్టిక్ రైల్వే స్టేషన్ దగ్గర గుమ్మికూడి అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు రైతునాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కర్ణాటక రైతులకు సంఘీభావం తెలపడానికి దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, నల్లమల్ల వెంకటేశ్వరరా వు, దైవసిగామని, కెఎం రామ గౌండర్, కె శాంత కుమార్ ఏఎస్ బాబులతో పాటు ఉత్తర భారతదేశం నుంచి వెళ్లిన శివకుమార్ కక్కాజి, దల్లే వాల్‌లు కూడా అరెస్టయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం సమ్యలపై రైతులు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు సం బంధించిన యంత్ర పరికరాలపై జిఎస్టీ రద్దు చేయాలని, తెలంగాణ మోడల్ రైతు పథకాలు ప్రతి రాష్ట్రాల్లో అమలు చెయ్యాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించాలని, తెలంగాణ మోడల్ రైతు పథకాలు కావాలని డిమాండ్ చేశారు.