హైదరాబాద్ నగరానికి చెందిన పర్వతారోహణ బృందం హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో 19600 ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన బృందం సభ్యులు తాజాగా రికార్డ్ సెట్టర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తమ పేరును పొందుపరచారు. రంగారావు నేతృత్వంలో డాక్టర్ శివకుమార్ లాల్, అలీ అహ్మద్ పర్వతారోహణ చేస్తూ హిమాలయాల్లో సముద్రమట్టానికి 19800 అడుగుల ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్నామని, ఇప్పటివరకు పర్వతారోహకులెవరూ చేరుకోని ఈ పర్వతాన్ని గుర్తించి దానికి తెలంగాణ అని పేరు పెట్టామని అడ్వంచర్ క్లబ్ సభ్యులు తెలిపారు.
జూన్ 2న కాంగ్రి పర్వత శిఖరానికి చేరుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించామని, బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటామని వారు చెప్పారు. ఈ సాహస యాత్రకు సంబంధించిన వీడియో పుటేజ్ తో పాటు, వార్తా కథనాలను పరిశీలించిన రికార్డ్ సెట్టర్ సంస్థ తెలంగాణ శిఖరాన్ని అధిరోహించిన బృందం వరల్డ్ రికార్డ్ సాధించినట్లుగా ప్రకటించిందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ అరుదైన రికార్డును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో తెలంగాణ ప్రజలకు అంకితమివ్వనున్నట్లు అడ్వంచర్ క్లబ్ సభ్యులు రంగారావు చెప్పారు.