mt_logo

మంత్రి కేటీఆర్ తో పారిశుధ్య కార్మిక సంఘాల చర్చలు సఫలం!!

గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయితీ, పురపాలక పారిశుధ్య కార్మిక సంఘాలు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ హామీతో గురువారం తమ సమ్మెను విరమించాయి. ఉన్నతస్థాయి కమిటీని నియమించి రెండు నెలల్లో కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. గురువారం సచివాలయంలోని పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ చాంబర్ లో కార్మికనేతలు, ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి, గ్రామ పంచాయితీల ఆదాయంలో వేతనాల వ్యయ పరిమితిని 30 నుండి 50 శాతానికి పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు వెంటనే జీవోను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సమావేశంలో సీపీఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య, సీపీఐ శాసనసభాపక్ష నేత ఆర్ రవీంద్ర కుమార్ నాయక్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గ్రామపంచాయితీ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, న్యాయ, ఆర్ధిక శాఖ అధికారులతో కలిపి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కమిటీ రెండు నెలల్లో కార్మిక సంఘాలు, కార్మికులు, అధికారులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి జరుపుతుందని చెప్పారు. పల్లెల ప్రగతి కోసం, మార్పు కోసం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో కార్మికులు పాల్గొనాలన్నది తమ ఆలోచనన్నారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ మంత్రితో జరిపిన చర్చలు సంతృప్తి కలిగించాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ కార్మికుల సమస్యల పట్ల స్పందించిన తీరు తమకు విశ్వాసాన్ని కలిగించిందని, సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చినందుకు వారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *