mt_logo

ఆంధ్ర కేసరి అనే అబద్దం

అయిదు దశాబ్దాలుగా తెలంగాణ స్కూళ్లలో నేర్పుతున్నది సీమాంధ్ర చరిత్రనే. భాష నుండి భావం వరకూ సర్వం సీమాంధ్రమయం. ఆఖరుకు పాఠ్యపుస్తకాల్లో ఉండే కథల్లో పాత్రలు కూడా ఏ ఒంగోలుకో, బందరుకో వెళతాయి. ఇక లీవ్ లెటర్ రాసే పాఠంలో అడ్రస్ సైతం ఏ విజయవాడలోని విద్యాధరపురంలోనో ఉంటుంది.
(తెలంగాణ ఉద్యమం నుండి ఈ విషయాలను ఎత్తిచూపుతూ విమర్శలు వచ్చాక ఇందులో కొన్ని మార్చడం జరిగింది. కానీ ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి)
ఉదాహరణకు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు మీద మన పాఠ్యపుస్తకాల్లో ఇప్పటికీ చెబుతున్న ఈ అందమైన అబద్ధాన్ని చూడండి:

.

దాచేపల్లి పబ్లికేషన్స్ వారి నాలుగవ తరగతి తెలుగు వాచకంలో “ప్రకాశం పంతులుగారు” అనే పాఠంలో ఇలా ఉంటుంది.

“బ్రిటిషు నాయకులారోజులలో “సైమన్ కమీషన్” ను ప్రవేశపెట్టిరి. గాంధీజీ దానిని బహిష్కరించుటకు ప్రజలను కోరెను. అది మద్రాసు నగరమునకు రాగా ప్రకాశం నాయకత్వమున వేలాది ప్రజలు దానిని వ్యతిరేకించిరి. ప్రకాశమును సైనికులు ముందుకు నడిన కాల్చి చంపెదమని బెదిరించిరి. అంత ప్రకాశం సింహంవలె గర్జించుచు చేతనైన నన్ను చంపివేయుడని ముందుకు నడిచెను. అతని ధైర్యమునకు సైనికులు నిశ్చేష్టులైరి. తుపాకులు దించి సైనికులు మరలిపోయిరి. అపుడు లక్షలాది మంది ప్రకాశంగారి ధైర్యమునకు మెచ్చుకొనిరి. గాంధీగారు అతనిని “ఆంధ్రకేసరి” అను బిరుదముతో సత్కరించెను.”

గత యాభై ఏండ్లనుండి ప్రామాణికమైన చరిత్రగా చలామణి అవుతున్నదీ విషయం. మనందరం స్కూళ్లో చదువుకున్నది కూడా ఇదే.

ఇక ఇదే విషయం గురించి తెలుగు వికీపీడియా ఏమంటున్నదో చూడండి:

ఎంతో కాలంగా మనం నిజమని నమ్ముతూ వస్తున్న విషయం అబద్ధమని తెలిస్తే నిజంగానే దిగ్భ్రమ కు లోనవుతాం. ఇది చదివాక మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

ఈ సంఘటన గురించి టంగుటూరి ప్రకాశం పంతులు స్వయంగా తన ఆత్మకథ “నా జీవిత యాత్ర” లో ఏమని రాసుకున్నారో చదవండి:

సో, అదన్నమాట విషయం!

మన పాఠ్యపుస్తకాలేమో సైమన్ కమీషన్ మద్రాసుకు వస్తే దాన్ని నిరసించడానికి ప్రకాశం వేలాదిమంది ప్రజలతో బయలుదేరగా ఆయనను బ్రిటీష్ సైనికులు అడ్డుకున్నట్టు, దాన్ని ప్రకాశం ఎదిరించగా ఆ సైనికులు ఆయన గుండెకు తుపాకీ ఎక్కుపెట్టినట్టు, పంతులుగారు వెంటనే ధైర్యంగా చొక్కా చించి తన రొమ్మును చూపి “కాల్చండిరా దమ్ముంటే” అనీ సింహగర్జన చేసినట్టూ బిల్డప్ ఇచ్చారే

నిజానికి ఈ సంఘటన జరిగింది సైమన్ కమీషన్ మద్రాసుకు వచ్చినప్పుడు కాదు. అది బొంబాయికి వచ్చినప్పుడు మద్రాసులో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రకాశం గారు ఆ రోజు ప్రజాసమూహాన్ని ముందర నిలబడి నడిపించలేదు. మధ్యాహ్నం నగరంలో పరిస్థితి సమీక్షించడానికి కారువేసుకుని బయలుదేరారు. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ మృతదేహం చూడడానికి వెళ్లబోగా ప్రకాశంతో పాటు ఉన్న కొందరిని సైనికులు ఆపారు. ఒక సైనికుడు ప్రకాశం వైపు తుపాకీ గురిపెట్టగా పక్కనున్న ముస్లిం యువకుడు “ధైర్యం ఉంటే కాల్చు, మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆయనెవరో నీకు తెలియదల్లే ఉంది” అని అరిచాడు.

అసలీ సంఘటన గురించి మరునాటి పేపర్లలో ఒక్క వాక్యం కూడా రాలేదంటేనే దీనికి అంత సీన్ లేదని అర్థం అవుతుంది. కానీ సీమాంధ్ర చరిత్రకారులేమో అసలు భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మలుపు తిప్పిన కీలక ఘటన రేంజ్ లో దీన్ని చూపించారు.

ఏకంగా లాలా లజపతిరాయ్ సైమన్ కమీషన్ కు ఎదురొడ్డి పోరాడిన వీరోచిత ఘటనతో పోలిక తెచ్చి లాలాకు “పంజాబ్ కేసరి” అని బిరుదు ఇచ్చినట్టుగానే ప్రకాశం గారికి “ఆంధ్ర కేసరి” అనే బిరుదు తగిలించేశారు.

పోనీ ఆ రోజు జరిగిన సంఘటనల రికార్డు లేదు కాబట్టి ఇటువంటి ప్రచారం జరిగిందనుకోవడానికీ లేదు. ఆరోజు పోలీసు కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి పేరుతో సహా అన్ని విషయాలు రికార్డు అయ్యే ఉన్నాయి. అయినా ప్రకాశం స్వయంగా రాసుకున్న ఆత్మకథలో ఇంత స్పష్టంగా జరిగినదేమిటో రాసుకున్నా అది వదిలి పదేపదే అబద్ధాలను వల్లెవేయడం ఏమిటి?

ఇవీ సమైక్య రాష్ట్రంలో పిల్లలకు నేర్పే అబద్ధాల, అర్థసత్యాల చరిత్ర పాఠాలు. స్వయంగా ఇటువంటి అబద్దాల చరిత్రను మాపై రుద్ది, ఉల్టా తెలంగాణవాదులు అబద్దాలాడుతున్నారు అనడం మీకే చెల్లింది.

తుపాకీకి ఎదురొడ్డి చనిపోయిన వీరులు వేలమంది ఉన్న తెలంగాణ గడ్డమీద ఆ వీరుల చరిత్ర బోధించకుండా తమకు ఏ సంబంధమూ లేని నాయకుల  పుక్కిటి పురాణాలను బోధించడం కుట్రకాక మరేమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *