mt_logo

“ధరణి” పోర్టల్ కు ఏడాది పూర్తి.. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ధరణి శకం మొదలై విజయవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ధరణి సేవలను అద్భుతంగా అమలు చేస్తున్నందుకు అధికారులను, జిల్లాల కలెక్టర్లను గురువారం ప్రత్యేకంగా అభినందించారు. ధరణి అందిస్తున్న పారదర్శకమైన, అవాంతరాలు లేని సేవలతో పౌరులు, ముఖ్యంగా రైతులు ఎంతో ప్రయోజనం పొందారని సంతోషం వ్యక్తంచేశారు. ధరణి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని చెప్పారు. పోర్టల్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులు, జిల్లా కలెక్టర్లు, తాసిల్దార్లకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

భూ లావాదేవీలకు గమ్యస్థానం :

రెవెన్యూ పరిపాలనలో ధరణి అత్యాధునిక ఆన్‌లైన్‌ పోర్టల్‌. రికార్డుల్లో మార్పులు చేర్పుల్లో అధికారుల విచక్షణాధికారాలకు తావులేకుండా, ట్యాంపర్‌ చేసే వీలు లేకుండా దీన్ని రూపొందించారు. భూ లావాదేవీలకు ధరణి గమ్యస్థానంగా (వన్‌-స్టాప్‌) నిలిచింది. పోర్టల్‌ ప్రారంభంతో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. గతంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా ల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ధరణి ద్వారా తాసిల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా ఇవ్వడంతో ప్రస్తుతం 574 తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

ఏడాదిలోనే అద్భుత ప్రగతి :

అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్‌ను గతేడాది అక్టోబర్‌ 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. నాటి నుంచి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరిగే విధా నం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. అప్పటినుండి భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పి, ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే అద్భుత ప్రగతి సాధించిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఏడాదిలోనే 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయని వెల్లడించింది. అంతకుముందు పాస్‌ పుస్తకాలు ఇవ్వని దాదాపు 1.80 లక్షల ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపింది. నిత్యం జరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకొనే సామర్థ్యం ధరణి ప్రత్యేకత అని అధికారులు చెప్పారు. నిపుణులు, అధికారులు, ప్రభుత్వం నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా మాడ్యూల్స్‌ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్‌, 10 సమాచార మాడ్యూల్స్‌ ఉన్నాయి. ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకే పరిమితం కాకుండా భూ సమస్యలను తీర్చే బాంధవిగా మారింది. పెండింగ్‌ మ్యుటేషన్లతోపాటు ఇతర భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక మాడ్యూల్స్‌ ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిశీలించి పరిష్కరిస్తున్నారు. పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి.

మూడు సూత్రాలు :

రైతుల అన్ని రకాల భూకష్టాలకు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ సూచించిన మూల సూత్రాలు మూడు. 1) రైతుల భూములు భద్రంగా ఉండాలి. ఇష్టమున్నట్టు వివరాలు మార్చేందుకు అవకాశం ఉండొద్దు. 2) ప్రపంచంలో ఏ మూలన ఉన్నా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు కనిపించాలి. యజమానులు ఏ క్షణంలో అయినా తమ భూమి వివరాలను చెక్‌ చేసుకొనేలా వ్యవస్థ ఉండాలి. 3) భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఏకకాలంలో జరగాలి. అధికారులతో చర్చల సందర్భంగా కేసీఆర్‌ పదేపదే ఇదే సూత్రాన్ని చెప్పేవారు. ధరణికి ఓ రూపం ఇచ్చేందుకు అధికారులతో కలిసి సీఎం అహోరాత్రులు శ్రమించారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన మొదలు, జిల్లాల విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, నూతన రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకొన్నారు.

రికార్డుల ప్రక్షాళన :

వ్యవసాయ భూముల రికార్డుల్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని గుర్తించిన ప్రభుత్వం, రికార్డుల ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు 2017 సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 నాటికి అన్ని గ్రామాల్లోని 2.38 కోట్ల ఎకరాల భూముల రికార్డులను ప్రక్షాళన చేశారు. మ్యుటేషన్‌, పార్టిషన్‌, ఫౌతి, పేర్లలో తప్పులు, ఖాతాల నవీకరణ, డబుల్‌ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర భూముల గుర్తింపు, ప్రభుత్వ భూముల గుర్తింపు వంటి అంశాలపై దృష్టిపెట్టి రికార్డులను నవీకరించి వాటి ఆధారంగా కొత్త పాస్‌బుక్‌లు మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలోని భూ రికార్డుల స్వచ్ఛత 65 శాతం నుంచి 93 శాతానికి పెరిగింది. పలు రాష్ట్రాలు ఇక్కడి రికార్డుల ప్రక్షాళన విధానాన్ని తెలుసుకున్నాయి.

నూతన రెవెన్యూ చట్టంతో అధికారాలకు చెక్‌ :

రికార్డుల ప్రక్షాళన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 140కి పైగా ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకం చేయడంతోపాటు రైతులను వెంటాడుతున్న 76 రకాల భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు 2020 సెప్టెంబర్‌ 10న నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘చరిత్రాత్మక, అద్భుతమైన ప్రగతి బాటలు వేసే చట్టం ఇది. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి.. రైతులకు, నిరుపేదలకు, నోరు లేనివారికి అండగా నిలిచే చట్టం ఇది. తెలంగాణ వచ్చినరోజు ఎంత సంతోషంగా ఉన్నానో ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఈ రోజు అంతే సంతోషంగా ఉన్నాను’ అని సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. ఈ చట్టంతో రెవెన్యూ అధికారులకు విచక్షణాధికారాలు రద్దయ్యాయి. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చింది.

మూడేండ్ల మథనం ఫలితం :

ధరణి పోర్టల్‌ ప్రారంభం వెనుక మూడేండ్ల మథనం ఉన్నదని సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. భూ సమస్యలకు పరిష్కారం చూపాలని 2016లోనే కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, నిపుణులు, రిటైర్డ్‌ అధికారులతో బృందాలను ఏర్పాటుచేశారు. వివిధ రాష్ట్రాల్లోని రెవెన్యూ పోర్టళ్లను ఒక బృందం అధ్యయనం చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో పర్యటించింది. మరో బృందం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించింది. నిపుణుల బృందం నూతన రెవెన్యూ చట్టం రూపకల్పన కోసం శ్రమించింది. తెలంగాణస్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌)కు చెందిన సాంకేతిక బృందం పోర్టల్‌ రూపకల్పన భారాన్ని తీసుకున్నది. వీటన్నింటినీ సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షించేవారు. ఇలా మూడేండ్ల మేధో మథనం తర్వాత ధరణి పోర్టల్‌ ఆవిర్భవించింది. ఏడాదికాలంగా విజయవంతంగా కొనసాగుతూ ‘భూ బాంధవి’గా అవతరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *