భారీ వర్షాలకు తీవ్రమైన వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భధ్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఆదేశించారు. దీంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామాగ్రితో పాటు అదనంగా మరిన్నింటిని తరలించాలని సీఎం ఆదేశించారు. కాగా లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన సామగ్రితో సహా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ సభ్యులకు హెలీకాప్టర్లు భద్రాచలానికి చేరుకున్నాయి. అలాగే సీఎం ఆదేశాల మేరకు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వామ్యులవుతున్నారు.