తెలంగాణలోని 441 ప్రభుత్వ ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపిక కావడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతమైందని, పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయనే దానికి ఈ కాయకల్ప అవార్డులే నిదర్శనం అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడానికి మౌలిక వసతులు పెంచడంతో పాటు విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకు వచ్చామని మంత్రి తెలిపారు. దవాఖానల్లో పరిశుభ్రత, పేషెంట్ కేర్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రజలకు మరిన్ని నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, త్వరలో దేశానికే తెలంగాణ వైద్యారోగ్య రంగం ఆదర్శంగా మారుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన ఆయా ఆసుపత్రుల సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.