mt_logo

‘రైతుబంధు’పై జాతీయ మీడియా ప్రశంసలు

రైతుబంధు పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. పెట్టుబడి సాయం పంపిణీ 50 వేల కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా ఎన్డీటీవీతోపాటు ఇతర జాతీయస్థాయి చానళ్లు ఈ పథకంపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 50 వేల కోట్లను నేరుగా జమ చేసిందని ప్రముఖంగా కథనాలు వెలువరించాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రైతులు ఈసారి ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబురాలు, రైతుబంధు సంబురాలు చేసుకొన్నారని తెలిపాయి. సీఎం కేసీఆర్‌ 2018 మేలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని, ప్రతి సీజన్‌కు ముందు ఎకరాకు 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని వెల్లడించాయి. ఈ డబ్బులతో రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర అవసరాలను తీర్చుకొంటున్నారని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నాయి. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కానివిధంగా తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి వేగంగా సాధ్యమైందని జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఏడేండ్లలో వ్యవసాయ రంగంపై రూ.2.7 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయభివృద్ధికి కృషి చేసిందని వెల్లడించాయి. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి 2013-14లో 1.8 శాతం ఉండగా, ప్రస్తుతం 8.1 శాతానికి పెరిగిందని వివరించాయి. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 21 శాతంగా ఉన్నదని తెలిపాయి.

దేశానికే ఆదర్శం :

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పలు జాతీయ మీడియా చానెళ్లు కితాబునిచ్చాయి. ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలియజేశాయి. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఏపీ, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపాయి. చివరికి కేంద్రం కూడా పీఎం కిసాన్‌ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నాయి. సీఎం కేసీఆర్‌ దేశవ్యాప్తంగా రైతుల గొంతుకై నిలుస్తున్నారని కొనియాడాయి.

మా అప్పులు తీర్చింది : తెలంగాణ రైతులు

రైతుబంధుపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన ఎన్డీటీవీ క్షేత్రస్థాయిలో ఈ పథకం గురించి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా పలువురు రైతుల అభిప్రాయాలను సేకరించింది. ఎన్డీటీవీతో పలువురు రైతులు మాట్లాడుతూ రైతుబంధు పథకం తమకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ పథకం అమలైనప్పటి నుంచి అప్పులు చేయకుండా బతకగలుగుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆర్నెళ్లకోసారి బ్యాంకు ఖాతాలో రైతుబంధు పైసలు వేస్తున్నరని, దాంతో ఎరువులకు, విత్తనాల కొనుగోలుకు పెట్టుబడి కష్టం తప్పిందని వెల్లడించారు. పెట్టుబడి ఖర్చుల కోసం గతంలో సావుకార్ల చుట్టూ తిరిగేవాళ్లమని, ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *