mt_logo

ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడిని ఖండించిన టీఆర్ఎస్..

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరంగల్ పర్యటనలో భాగంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడులు జరగడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉప్పల్ నుండి వరంగల్ వరకు పలుచోట్ల ఎమ్మార్పీఎస్ నేతలపై దాడులు జరిగాయని, ఈ ఘటనలకు సంబంధించి చంద్రబాబు, ఎర్రబెల్లి దయాకర్ రావులు బాధ్యత వహించాలని టీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ళ శ్రీనివాస్, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, సామ్యేల్ అన్నారు.

ఇదిలాఉండగా హన్మకొండలో జరగబోయే టీడీపీ సభా వేదికకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారు. దీంతో సభావేదిక పూర్తిగా దగ్ధమయ్యింది. ఖాజీపేటలో కూడా టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని, ఏబీసీడీ వర్గీకరణకు తీర్మానం చేయని చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హెచ్చరించారు. టీడీపీ ఫ్లెక్సీల దగ్ధానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలను ఖండిస్తున్నామని, టీడీపీ పారిపోయిన పార్టీ అని, అరిగిపోయిన రికార్డు అయిన టీడీపీని ఎవరూ పట్టించుకోరని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు ఎంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంతేనని, వరంగల్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు తన గూండాలతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పాలనను అశాంతిగా మార్చేందుకే చంద్రబాబు వరంగల్ పర్యటన చేస్తున్నారని, వరంగల్ లో దళితులపై జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబు, ఎర్రబెల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్రోళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, వరంగల్ లో టీడీపీకి కార్యకర్తలు లేరని, చంద్రబాబు తనవెంట తెచ్చుకున్న గుండాలతోనే సభ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్యాకేజీల కోసం టీటీడీపీ నేతలు ఇంకా ఎన్నేళ్ళు చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలుకుతారని? తెలంగాణ ప్రజల కంటతడికి తానే కారణమని చంద్రబాబు చెప్తాడా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *