mt_logo

42 టీఎంసీలు అదనంగా వాడుకున్న ఏపీ!

బుధవారం నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఆ శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో 42 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం అదనంగా వాడుకుందని, నాగార్జున సాగర్ కుడికాల్వకు చుక్క నీరు కూడా విడుదల చేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంటలకు నీరు అవసరమనుకుంటే, ఇప్పటివరకు వాడుకున్న టీఎంసీలు, ముందుముందు ఎన్ని టీఎంసీల నీరు అవసరమో లిఖితపూర్వకంగా ఏపీ సర్కారు తెలియజేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం లేఖ రాస్తే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించాక ఆయన సలహాలు, సూచనల మేరకు ముందుకుపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలాఉండగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు మంగళవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కృష్ణా నదీ జలాల వివాదాన్ని రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని పరిష్కరించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని టీఎంసీలు వినియోగించుకుంది? ఇంకా ఎన్ని టీఎంసీలు కావాలి? అన్న విషయంపై తెలంగాణ సర్కారుకు రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని సూచించింది. నాగార్జున సాగర్ లో 616.37 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కృష్ణా బేసిన్ లో రెండు రాష్ట్రాలకు కలిపి 549.65 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ 41.61 శాతం(228.71 టీఎంసీలు), ఏపీ 58.39 శాతం(320.94 టీఎంసీలు) వాడుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఇప్పటివరకు 137 టీఎంసీలు మాత్రమే వాడుకోగా ఇంకా సుమారు 93 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా నీటిని వినియోగించుకోకుంటే ప్రస్తుతం నాగార్జునసాగర్ లో 93 టీఎంసీల నీటి లభ్యత ఉండేదని, ఏపీ ప్రభుత్వం అదనపు వాడకం వల్ల సాగర్ లో కేవలం 51 టీఎంసీల నీరు మాత్రమే ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రతిరోజూ 4 వేల క్యూసెక్కుల చొప్పున నీళ్ళు వదిలినా సాగర్ లో నీటిమట్టం 532 కు పడిపోవడంతో కుడికాల్వకు నీళ్ళు వదల్లేని పరిస్థితి వచ్చింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే జోషి, సాగర్ చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *