mt_logo

వైద్యపరికరాల ఉత్పత్తికి కేరాఫ్ తెలంగాణ.. లైఫ్ సైన్సెస్ లక్ష్యం లక్ష కోట్లు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో లైఫ్‌ సైన్సెస్‌ సంబంధిత పరిశ్రమలను 2030 నాటికి లక్ష కోట్లకు పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే జీవ ఔషధ రంగంలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, రాబోయే రోజుల్లో సూదులు, సిరంజీలు, ఐవీ ఫ్లూయిడ్స్‌, గ్లౌజ్‌లు తదితర వైద్య పరికరాల ఉత్పత్తికి కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కులో ఏడు కంపెనీలను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… మెడికల్‌ డివైజెస్‌ పార్కులో ఒకేరోజు ఏడు కంపెనీలను ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు. జీవ ఔషధరంగం, వైద్యపరికరాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, తయారీ విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఇప్పటికే గొప్ప గుర్తింపు సాధించిందని స్పష్టం చేశారు.

ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాసిటీ తెలంగాణాలోనే :

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటుచేసిందని, షామీర్‌పేటలో జీనోమ్‌వ్యాలీని నెలకొల్పిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 35శాతం వాటా హైదరాబాద్‌దేనని పేర్కొన్న కేటీఆర్.. ఇక మెడ్‌టెక్‌ పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించామని చెప్పారు. నాణ్యమైన వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్‌ సాధనాలు, ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను రాష్ట్రప్రభుత్వం ముందుగానే గుర్తించి ఆయా విభాగాల్లో పరిశోధన, ఆవిషరణ, తయారీని ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. వైద్య పరికరాల పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకంగా మారుతున్నదని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వివరించారు. మెడికల్‌ డివైజెస్‌ పార్కును ప్రపంచానికి గ్లోబల్‌ ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా గ్లోబల్‌ మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌గా మారుస్తామని నొక్కిచెప్పారు. కరోనా టీకాలను వేగంగా ఉత్పత్తిచేయటంలో కీలకంగా మారిన ఇంజినీర్డ్‌ మోడిఫైడ్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికత అభివృద్ధి, బయోప్రోస్తెటిక్‌ ఇంప్లాంట్లు, ఇంట్లోనే జన్యు పరీక్ష చేసుకొనే కిట్లు, కార్డియాక్‌ డయాగ్నస్టిక్‌ టూల్స్‌, అల్ట్రాసౌండ్‌ పరికరాలు, మొబైల్‌ వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు తదితర పరికరాల ఉత్పత్తిలో పెట్టుబడులను రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *