mt_logo

తెలంగాణ రైతురాజ్యంగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 


తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం వనపర్తి నియోజకవర్గంలో 41 రైతు వేదికలలోని రైతుల ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాల్ పేట, పొలికెపాడు రైతు వేదికలలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతు రాజ్యంగా, రైతు రాష్ట్రంగా నిలవాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. వ్యవసాయానికి, వ్యవసాయదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు కింద పంట పెట్టుబడి, రైతు భీమా పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎవరూ ఇవ్వడం లేదన్నారు. రైతు పరిస్థితి 2014 తెలంగాణకు ముందు ఎలా ఉందో 2014 తెలంగాణ తర్వాత ఎలా ఉందో రైతులందరూ బేరీజు వేసుకోవాలన్నారు.

సాంప్రదాయ పంటల సాగు నుండి రైతులు బయటకు రావాలని.. ఏ రకమైన పంటలు పండిస్తే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందో వాటినే పండించాలని మంత్రి అన్నారు. నిరంతరం పంటల సాగు, సాగు పద్దతుల అంశాల మీద రైతువేదికలలో చర్చ జరగాలని, ఆహార ధాన్యాల పంటలతో పాటు ఉద్యాన పంటల మీద ఇకపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. పండ్ల తోటలు, ఆయిల్ పామ్, నూనె గింజల సాగు మీద దృష్టిపెట్టి .. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా చూసుకోవాలని రైతులకు ఈ సందర్భంగా సూచించారు. రైతులు ఆర్థికంగా స్థిరత్వం సాధించి బలపడితే ఆయన చుట్టూ ఉన్న సర్వ వ్యవస్థలు బలపడతాయని, రైతు బతికితేనే రాజ్యం బతుకుతుందని మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ గారి సహకారంతో రైతులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తూ.. డిజిటల్ స్క్రీన్లతో రైతులకు రైతు వేదికల ద్వారా వ్యవసాయ సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని మంత్రి తెలియజేసారు. అలాగే మార్కెటింగ్ నెట్ వర్క్ ను వ్యవసాయరంగానికి అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. 41 రైతు వేదికలలో రైతు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని.. త్వరలో 25 వేల మందితో వనపర్తిలో భారీ అన్నదాతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు. ఈ సమ్మేళనానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అనుబంధ రంగాల నిపుణులను ఆహ్వానించి.. రైతు ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రేవల్లి మండలకేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ పోతుగంటి రాములు హాజరు కాగా, రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *