mt_logo

తెలంగాణ సిగలో మరో కలికితురాయి .. ప్రపంచ విత్తన సదస్సుకు ఆహ్వానం పలికిన ఐరాస

తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్‌ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించబోతున్న ‘అంతర్జాతీయ విత్తన సదస్సు’కు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సదస్సులో ‘ఏ సక్సెస్‌ స్టోరీ ఆఫ్‌ ఇండియా: తెలంగాణ స్టేట్‌ ఈజ్‌ ఏ గ్లోబల్‌ సీడ్‌ హబ్‌’ అన్న అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎఫ్‌ఏవో ఆహ్వానించడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తనరంగానికి విశిష్ఠ గౌరవం లభించినట్టయింది. అంతేకాకుండా దేశంలో ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు హాజరుకానున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తిలో తెలంగాణ అభివృద్ధిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎలా ఎదిగిందన్న అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ఏకకాలంలో అంతర్జాతీయ భాషలైన ఇంగ్లిష్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌ భాషల్లో ప్రసారం కానున్నది. తెలంగాణ రాష్ట్రానికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన ఎండీ కేశవులును అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *